కథను నమ్ముకునే “తల్లి మనసు” తీశాం!

1
- Advertisement -

మంచి కథే సినిమాకు ప్రాణం. మొదట్నుంచి ఆ కథను నమ్ముకునే నేను సినిమాలను తీశాను.. “తల్లి మనసు” సినిమా కూడా ఇంటిల్లిపాది చేసేవిధంగా చక్కగా రూపుదిద్దుకుంది” అని చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య స్పష్టం చేశారు.రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని తమ సంస్థ కార్యాలయంలో ముత్యాల సుబ్బయ్య మాట్లాదుతూ, “ప్రముఖ హీరోలందరితో సినిమాలు చేశాను. దర్శకుడిగా 50 సినిమాలను తీశాను. మంచి కధలను ఎంచుకోవడమే కాదు వాటికి తగ్గ మంచి టైటిల్స్ పెట్టి, ప్రేక్షకుల ఆదరణతో నా సినీ ప్రయాణం సాగింది. నా యాభై సినిమాలలో అద్భుతమైన సక్సెస్ సినిమాలే కాదు కొన్ని ఫెయిల్యూర్స్ కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఏ రోజు ఏదో ఒక సినిమా చేసెయ్యాలని, చుట్టేయాలని అనుకోలేదు. ఏదో ఒక కోణంలో సమాజానికి పనికి వచ్చే పాయింట్ తో పాటు సెంటిమెంట్, కామెడీ, డ్రామా వంటి అంశాలను మేళవించి సినిమాలు చేశాను. ఒక దశలో కొన్ని సెంటిమెంట్ సినిమాల కారణంగా నాకు సెంటిమెంట్ సుబ్బయ్య అని కూడా పేరొచ్చింది. నేను దర్శకుడిగానే 50 సినిమాలను చేశాను తప్ప నిర్మాతగా గతంలో ఏ సినిమాను తీయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్ కు నిర్మాతగా ఒక మంచి సినిమా తీయాలనే అభిరుచి మేరకు ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఆ మేరకు ముత్యాల మూవీ మేకర్స్ పెట్టి, మంచి కథ దొరికే వరకు వేచి చూసి, ఈ సినిమాను రూపొందించాం. ఒక అనుభవం ఉన్న నిర్మాతగానే తానే అన్నీ అయ్యి, అనంత కిషోర్ ఎంతో చక్కగా చూసుకున్నారు.

నా దగ్గర, అలాగే చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం గురించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నేను సీనియర్ దర్శకుడిని అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో కానీ దర్శకత్వంలో కానీ సూచనలు, సలహాలు ఇచ్చానే తప్ప ఎక్కడా వేలు పెట్టలేదు. ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ అని సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించడం ఆనందదాయకం. ఒకరు ఓల్డ్ టైటిల్ల్ లా అనిపిస్తోందని కామెంట్ చేశారు. అందుకు నేను చెప్పింది ఒక్కటే… తల్లి లేకుండా ప్రపంచమే లేదు. మనుష్యులకే కాదు సమస్త జీవ రాశికి, ఆఖరికి చెట్లకు సైతం తల్లి వేరు వల్లే పుట్టుక జరుగుతుందని, బదులిచ్చాను. అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. చూస్తున్న ప్రేక్షకులు ప్రతీ ఒక్కరూ కథలో, పాత్రలలో లీనమవుతారు. పాత్రలకు తగ్గ నటీ నటులనే ఎంచుకున్నాం. టైటిల్ పాత్రదారి కోసం ఎందరో నటీమణులను ప్రయత్నించాం. ఎట్టకేలకు కన్నడంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రచిత మహాలక్సీ అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. కధకు తగ్గట్టు మూడు పాటలు ఉంటాయి, కోటి సంగీతం, సుధాకరరెడ్డి ఛాయాగ్రహణం ఓ ప్లస్ పాయింట్. తప్పకుండా మా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది” అని అన్నారు.

Also Read:వైభవంగా వైకుంఠ ఏకాదశి

- Advertisement -