తిరుమల పవిత్రను కాపాడుతాం:చంద్రబాబు

0
- Advertisement -

శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనార్థం ఇచ్చే సర్వదర్శనం టోకెన్లు కోసం తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు విచారణ వ్యక్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేని వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో సీఎం శ్రీ చంద్రబాబు మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం శ్రీ చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూ లైన్లలో నిరీక్షిస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. టోకెన్లు జారీలో అలసత్వం వహించిన డీఎస్పీ శ్రీ రమణకుమార్, ఇన్‌చార్జి ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి లను సస్పెండ్ చేయగా, జేఈవో శ్రీమతి ఎం. గౌతమి, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీశ్రీధర్‌లను బదిలీ చేశారు. మృతి చెందిన 6 మందిలో ఒక్కోక్కరికి రూ.25 లక్షల పరిహారం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామన్నారు. ఆరోగ్యం సీరియస్ ఉన్న మరో ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ 33 మందిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, వారందరికి వైకుంఠ ఏకాదశి రోజున (శుక్రవారం) శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వారందరిని వారివారి ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ ఆదేశించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రైస్తవులకు జెరూసలేం, ముస్లింలకు మక్కా లాగా, తిరుమల హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమని, జీవితకాలంలో ఒకసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. భక్తుల ఆశయాలకు తగ్గట్లు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు, టిటిడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు, టిటిడి పాలక మండలి సభ్యులు సమిష్టిగా సమన్వయంతో భక్తితో సేవలు అందించాలని సూచించారు.

తిరుపతిలో టోకెన్లు జారీ చేయడంపై సీఎం స్పందిస్తూ, వైకుంఠ ఏకాదశి తొలిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని భక్తులు భావిస్తారని, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాడంగా విశ్వసిస్తారన్నారు. అయితే గత ఐదేళ్లలో తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కొత్త సంస్కృతి ఆగమ శాస్త్రం ప్రకారం చేశారా అనేది తమకు తెలియదన్నారు. ఆగమ నిపుణలను సంప్రదించి టిటిడి బోర్డు ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న క్షత్రగాత్రులతో మాట్లాడితే తిరుపతిలో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వడం సరైంది కాదని భక్తులు చెప్పారన్నారు. తమ కూటమి ప్రభుత్వ వచ్చాక టిటిడిలో భక్తులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఒక్కోక్కటి మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే లడ్డూ ప్రసాదాలలో, అన్నప్రసాదాలలో నాణ్యతను పెంచామన్నారు. మరిన్ని మార్పులు చేసే క్రమంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. టిటిడి బోర్డులో చర్చించి భక్తులకు మెరుగైన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎవరైనా రాజకీయాలు చేస్తే శ్రీవారి లెక్కల నుంచి తప్పించుకో లేరన్నారు.

Also Read:ఎన్ని సార్లు రమ్మని చెప్పినా వస్తా: కేటీఆర్

- Advertisement -