అమెరికాలో ఓ భారతీయుడు వేసిన వీరంగం అంతా ఇంతా కాదు. పీకలదాకా తాగొచ్చి మరీ చిందులేశాడు. యువరాజ్ శర్మ అనే 43 ఏళ్ల వ్యక్తి ఈ నెల 6న ఓక్లాండ్‌లోని ఆల్ ఇండియా రెస్టారెంటుకు వెళ్లాడు. అంతే.. హోటల్ సిబ్బందికి, ఆయనకు గొడవ మొదలైంది. అసలు వీరి గొడవకి కారణం ఉల్లిపాయలు. అవునండీ…!
భోజనంలో ఉల్లిపాయలు పెట్టారన్న కారణంగా అమెరికాలోని రెస్టారెంటులో గొడవకు దిగాడో యువరాజ్ .
అంతేకాదు హోటల్ సిబ్బందిని గన్నుతో కాల్చిపడేస్తానంటూ కలకలం సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇరువురికీ వాగ్యుద్ధం జరిగింది. దాంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన శర్మ మర్నాడు ఫుల్ గా మద్యం తాగి ఆల్ ఇండియా రెస్టారెంట్ కు చేరుకున్నాడు. తన దగ్గర రివాల్వర్ ఉందని, షూట్ చేసి పడేస్తానని రెస్టారెంట్ యజమాని రవీందర్ సింగ్ ను బెదిరించాడు. దాంతో 911కి ఫోన్ చేసి పోలీసులుకు సింగ్ ఫిర్యాదు చేయడంతో.. ప్యాంటు విప్పేసి మళ్లీ బూతులందుకున్నాడు.
ఈలోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి తరలించారు. అరెస్టు చేసిన సమయంలో అతడు తీవ్ర మద్యం మత్తులో ఉన్నాడనీ.. అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. రెస్టారెంటు సిబ్బంది తనకు భోజనంలో ఉల్లిపాయలు పెట్టినందునే గొడవ మొదలైనట్టు విచారణలో ఒప్పుకున్నట్టు వెల్లడించారు.
కాగా ఈ వారంలో యువరాజ్ రెండు సార్లు రెస్టారెంటుకు వచ్చాడనీ.. మొదటి సారి వచ్చినప్పుడే భోజనం దగ్గర రభస చేసి వెళ్లాడని యజమాని రవీందర్ సింగ్ ఆరోపించారు. రెండోసారి తనకు సరిగ్గా వెల్‌కమ్ చెప్పలేదని గొడవ మొదలుపెట్టాడన్నారు. వెళ్లిపొమ్మన్నా వినిపించుకోకుండా బూతులు తిడుతూ, తనను కాల్చిపడేస్తానని బెదిరించాడన్నారు. భారతీయుడు కదా అనీ తొలుత ఫిర్యాదు చేయడానికి వెనక్కి తగ్గామన్నారు.
చివరికి అతడి ఆగడాలు మించిపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఇక శర్మపై బెదిరింపులు, అసభ్యకరమైన ప్రవర్తన, అరెస్ట్ ను నిరోధించడం, బహిరంగ మద్యపానం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అక్కడి పోలీసులు.