జమిలీ ఎన్నికలపై స్పందించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇది ఖచ్చితంగా రాజ్యాంగంపైనే దాడి అని అభిప్రాయపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని షర్మిల తెలిపారు.
బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలని ప్రశ్నించారు.
తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని తెలిపారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని షర్మిల తెలిపారు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read:Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!