బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోఛనీయమని విమర్శించారు.
బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. కేంద్రంలో పదేండ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదన్నారు. బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించాలన్నారు.
Also Read:బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి!