KTR:ఆగిన విద్యుత్ ఛార్జీల పెంపు..బీఆర్ఎస్ విజయం

2
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న 18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున నేడు, రేపు సంబరాలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని మన ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే 18,500 కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేయడంతో, ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్‌సీని ఒప్పించగలిగామని కేటీఆర్ అన్నారు.

మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షం వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్‌సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ అన్నారు.ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఈ సందర్భం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్‌సీ ముందు ఉంచడంలో విజయం సాధించామన్నారు.పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తనతో పాటు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఈఆర్‌సీని కలిసి విద్యుత్ చార్జీల పెంపును ఆపాలని కోరారని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ప్రజల తరఫున వాదనలను గట్టిగా వినిపించారన్నారు.

Also Read:Harishrao: తగ్గిన కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు

తాను స్వయంగా సిరిసిల్లలో జరిగిన విద్యుత్ చార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని ప్రజల వాదనను ఈఆర్‌సీకి ఒప్పించడం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు.ఈఆర్‌సీ ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకొని ప్రజలపై భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలపై భారీ విద్యుత్ భారం మోపకుండా ప్రజల పక్షాన నిలిచిన ఈఆర్‌సీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ చార్జీల పెంపును ఆపినందుకు ప్రజల తరఫున సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -