సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకూ ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న యాప్ వాట్సప్. రాత్రనకా పగలనక ఎప్పుడు పడితే అప్పుడు నేటి యువత వాట్సప్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వాట్సప్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అంతేకాకుండా కొత్తగా రీకాల్ ఫీచర్‌ను సైతం అందుబాటులోకి తీసుకురాబోతోంది. మరోవైపు ఆపిల్ ఐఓఎస్ వినియోగదారులకు సైతం కొత్త సౌలభ్యాలను అందించబోతోంది.
అయితే ఈ నెలతో పలు మొబైల్ కంపెనీలకు చెందిన వివిధ మోడళ్లలో వాట్సాప్ ఇక పనిచేయదు. ఈ ఫోన్లకు సపోర్ట్ నిలిపివేస్తామని గతంలోనే వాట్సాప్ ప్రకటించింది. ఆ గడువు జూన్ 30తో ముగియబోతోంది. దీంతో నోకియా, బ్లాక్‌బెర్రీ సంస్థల మోడళ్లతో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ ఆధారిత మొబైల్స్‌లో కొన్ని మోడల్స్‌లో జూన్ తర్వాత వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
జులై నుంచి వాట్సాప్ పనిచేయని మోడళ్ళు ఇవే..
నోకియాకు సింబియన్, ఎస్ 40 వెర్షన్స్‌తో పనిచేసే మోడళ్లతో పాటు ఆండ్రాయిడ్ 2.1, 2.2 వెర్షన్స్ మొబైల్స్‌లోనూ ఇక వాట్సాప్ పనిచేయదు. వీటితో పాటు బ్లాక్‌బెర్రీ 10, విండోస్ 7 ఓఎస్, ఆపిల్ సంస్థకు చెందిన ఐఓఎస్ 6తో పనిచేసే మొబైల్స్‌లో కూడా నిలిచిపోనుంది. వాస్తవానికి ప్రపంచంలో వినియోగిస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఆండ్రాయిడ్ ఫ్రోయోతో పనిచేసే మొబైల్స్ కేవలం 0.1 శాతం మాత్రమేనని గూగుల్సంస్థ గతంలో ప్రకటించింది. ఇక ఆపిల్ సంస్థ సైతం 8 శాతం మొబైల్స్ మాత్రమే ఐఓఎస్ 9 కంటే తక్కువ వెర్షన్స్‌తో పనిచేస్తున్నాయని ప్రకటించింది.
ఇదిలా ఉంటే..గతంలో ఈ సేవలను డిసెంబర్ నెలతోనే ముగిస్తున్నట్టు ప్రకటించింది. ఎక్కువ మంది యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆపరేటింగ్ సిస్టంలు అందిస్తున్న మొబైల్ లు వాడుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఎక్కువమంది వినియోగదారులు ఉపయోగించే మొబైల్ ఫోన్లకు అనుకూలంగా తమ మెసేజింగ్ యాప్ పనిచేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏదేమైనా పైన పేర్కొన్న ఓఎస్ వెర్షన్స్‌తో పనిచేస్తున్న మొబైల్స్ ఒకవేళ మీరు ఉపయోగిస్తుంటే ఇక జూన్ తర్వాత మీ మొబైల్లో వాట్సాప్ ఉపయోగించలేరు.