ఉద్యోగాల భ‌ర్తీ నిరంత‌ర ప్ర‌క్రియ‌:సీఎం రేవంత్ రెడ్డి

2
- Advertisement -

ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం కాద‌ని భావోద్వేగమ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ‌మ‌నేది తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ఉంద‌ని, నియామ‌కాలే ల‌క్ష్యంగా తెలంగాణ ఉద్య‌మం సాగింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఉద్యోగాల భ‌ర్తీ నిరంత‌ర ప్ర‌క్రియ అని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. డీఎస్సీ-2024 ఫ‌లితాల‌ను రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌దేళ్ల పాల‌న‌లో కేవ‌లం ఒక‌సారి డీఎస్సీ నిర్వ‌హించి 7,857 పోస్టులు భ‌ర్తీ చేస్తే, త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం ప‌ది నెల‌ల్లోనే 11,062 పోస్టుల‌కు డీఎస్సీ నిర్వ‌హించింద‌ని తెలిపారు. ప్ర‌తి పోస్టుకు 1:3 నిష్ప‌త్తిలో ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న చేప‌డ‌తామ‌ని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు అక్టోబ‌రు 9వ తేదీన ఎల్‌బీ స్టేడియంలో నియామ‌క ప‌త్రాలు అంద‌జేస్తామ‌ని, ఆయా అభ్య‌ర్థుల కుటుంబాల్లో ద‌స‌రా పండ‌గ‌కు ముందే పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన త‌ర్వాత టెట్ నిర్వ‌హించాల‌ని నిరుద్యోగుల నుంచి విజ్ఞ‌ప్తి వ‌స్తే మ‌రోసారి టెట్ నిర్వహించ‌గా డీఎస్సీ రాసేందుకు అద‌నంగా 1,09,168 మంది అభ్య‌ర్థులు అర్హ‌త సాధించార‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. డీఎస్సీ రాత ప‌రీక్ష‌ల‌ను జులై 18వ తేదీ నుంచి ఆగ‌స్టు 5వ తేదీ వ‌ర‌కు 26 సెష‌న్ల‌లో కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష (సీబీటీ) నిర్వ‌హించిన‌ట్లు సీఎం తెలిపారు. డీఎస్సీ, టెట్ నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రించారని, బాగా క‌ష్ట‌ప‌డ్డార‌ని విద్యా శాఖ అధికారుల‌ను ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

పేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ‌వ్యాప్తంగా వంద నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠ‌శాల‌లు వేర్వురుగా ఉండ‌డంతో పిల్ల‌ల్లో ఆత్మ‌నూన్య‌త భావం ఏర్పేడ‌ద‌ని.. దానిని తొల‌గించి వారి స‌మ‌గ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు సీఎం వివ‌రించారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 20 నుంచి 25 ఎక‌రాల్లో.. రూ.వంద కోట్ల‌తో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ ఏర్పాటు చేస్తామ‌ని సీఎం తెలిపారు. ఇప్ప‌టికే కొడంగ‌ల్‌, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. పేదల‌కు విద్య‌ను అందించాల‌నే ఆలోచ‌న గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వానికి లేద‌ని, అందుక‌నే ప‌దేళ్ల‌లో కేవ‌లం ఒక్క డీఎస్సీ మాత్ర‌మే వేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. విద్య‌కు త‌మ ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని, అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోనే డీఎస్సీ నిర్వ‌హ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, త‌మ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి ఇదే నిద‌ర్శ‌మ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. గ‌త ప్ర‌భుత్వం విద్యా శాఖ‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని, బడ్జెట్ కేటాయింపులు త‌క్కువ‌గా చేసేద‌ని, తాము అధికారంలోకి వ‌చ్చాక విద్యా శాఖ‌కు నిధుల కేటాయింపు పెంచామ‌ని, భ‌విష్య‌త్‌లో నిధులు మ‌రింత‌గా కేటాయిస్తామ‌ని సీఎం అన్నారు. గ‌త ప్ర‌భుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో వ‌స‌తి గృహాలు ఏర్పాటు చేసింద‌ని, క‌నీస మౌలిక వస‌తులు క‌ల్పించ‌లేద‌న్నారు. ప్ర‌స్తుతం ఆయా వ‌స‌తిగృహాల్లో ఎదురవుతున్న స‌మ‌స్య‌ల‌పై కొన్ని పార్టీలకు చెందిన‌ మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయ‌ని, పదేళ్లు ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించ‌డంతోనే ఆ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఇప్పుడు ఆయా పాఠ‌శాల‌ల్లో వ‌స‌తులు లేవంటూ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. అందుకే త‌మ‌ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంద‌న్నారు. గత ప్రభుత్వం ఏళ్ల త‌ర‌బ‌డి టీచర్ల ఉద్యోగోన్న‌తులు, బదిలీలు చేపట్టలేద‌ని సీఎం విమ‌ర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎటువంటి వివాదాలకు తావు లేకుండా బదిలీలు, ఉద్యోగోన్న‌తుల‌ ప్రక్రియ చేప‌ట్టామ‌ని ఆయ‌న తెలిపారు. విద్య‌పై పెట్టేది ఖ‌ర్చు కాద‌ని.. పెట్టుబ‌డి అని తాము భావిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల సంఖ్య‌తో ప్ర‌మేయం లేకుండా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు నిర్వ‌హిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు.

Also Read;ఆలియా భ‌ట్..‘జిగ్రా’

నిరుద్యోగుల‌కు అండ‌గా నిల‌వ‌డం, ఉద్యోగ నియామ‌కాలే ల‌క్ష్యంగా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామ‌ని ముఖ్య‌మంత్రి గుర్తు చేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టుల‌ను అంగ‌డీ స‌ర‌కుల్లా మార్చిన టీజీ పీఎస్సీని ప్ర‌క్షాళ‌న చేశామ‌న్నారు. ఎటువంటి లోపాలు లేకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తంగా మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామ‌ని సీఎం చెప్పారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, విద్యా క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఆకునూరి ముర‌ళి, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, విద్యా శాఖ క‌మిష‌న‌ర్ ఈవీ న‌ర‌సింహారెడ్డి, అద‌న‌పు డైరెక్ట‌ర్ కె.లింగ‌య్య, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

డీఎస్సీ నోటిఫికేష‌న్‌: 2024, ఫిబ్ర‌వ‌రి 29
మొత్తం పోస్టులు: 11,062
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ): 2,629
భాషా పండితులు (ఎల్పీ): 727
వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ): 182
సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్స్ (ఎస్జీటీ): 6,508
స్కూల్ అసిస్టెంట్ (స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్స్‌): 220
సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్స్ (స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్స్‌): 796

డీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు: 2,79,838
రాత ప‌రీక్ష‌కు హాజ‌రైన వారు: 2,46,584 (88.11 శాతం)

జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్‌కు..https://schooledu.telangana.gov.in/

- Advertisement -