వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు పలువురు ప్రముఖులు విరాళాన్ని అందజేయగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు.
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఏర్పడే ప్రకృతి విపత్తుల పట్ల స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తుంటారు ప్రభాస్. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ప్రస్తుతం “ది రాజా సాబ్” మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఏపీ, తెలంగాణ సహాయనిధులకు రూ.10 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి అంతా ముందుకు రావాలని కోరారు.