తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడి అని మండిపడ్డారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన దేశపతి..ఒకవైపు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకుంటుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదు; ఆయన వలసవాద పుత్రుడు..తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రైఫిల్ పట్టుకుని బయలుదేరాడు.రేవంత్ సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసకబారిపోయిందన్నారు.
జై తెలంగాణ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు తెచ్చారు..రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలుగా హేళన చేశాడు అన్నారు. మరోసారి తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు…తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి మన అస్తిత్వంపై దాడి అన్నారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భరతమాత ఓ ప్రేరణగా ఉంటే, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రేరణ,అనేక చర్చల తర్వాతే తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడం జరిగిందన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు నివాళిగా తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టాం..అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడింది కనుక సచివాలయానికి ఆయన పేరు పెట్టాం అన్నారు. సచివాలయం ఎదురుగా అమరజ్యోతి భవనం ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం, నిత్యం అమరుల స్ఫూర్తిగా పాలన జరగాలని..సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమే అన్నారు.
రాజీవ్ విగ్రహం పెట్టాలని మొండికేస్తే తెలంగాణలో అలజడి మొదలవుతుంది. మేము కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేయడం మానండి…గతంలో కాంగ్రెస్ తీరు వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.మళ్ళీ తెలంగాణ అస్తిత్వంపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే దాడిని కొనసాగిస్తోంది.గతంలో ఏపీ సచివాలయం ముందు తెలుగు తల్లి విగ్రహం ఉండేది. కనీసం ఆ స్ఫూర్తితోనైనా తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: శ్రీవారిని దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్