2024-25 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్లో ఏపీతో పాటు బిహార్‌కు పెద్దపీట వేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం చేస్తామని ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామన్నారు.
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం,భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్లకు ప్రత్యేక సాయం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు.
విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు, ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు, ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక బిహార్‌లో వరదల నివారణకు రూ.11,500 కోట్లు, రహాదారుల అభివృద్ధికి 26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రత్యేక టూరిజం ప్యాకేజీ ఇస్తామన్నారు.
Also Read:Union Budget 2024-25: కేంద్రబడ్జెట్ హైలైట్స్