రాష్ట్రంలో అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా అనే ఆందోళన బ్రాహ్మణ సామాజికవర్గంలో నెలకొందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ బ్రాహ్మణసంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా కావడం బాధాకరమని …విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన పథకాలు ఆగిపోవడం విచారకరమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20 లక్షల చొప్పున ఖర్చు చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని…. దీంతో సంక్షేమ పరిషత్ ద్వారా అమలు చేసే పథకాలు నిలిచిపోయాయని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి. వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి. బ్రాహ్మణ పరిషత్ పాలకవర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకొని, ఎంపికైన 300 మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు. వారికి స్కాలర్ షిప్స్ అందకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన రూ.30 కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలి. 2023-24 ఏడాదికి గాను ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న 344 మంది విద్యార్థులకు తక్షణమే ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట, ఖమ్మం, మధిరలో నిర్మించతలపెట్టిన బ్రాహ్మణ సదనాల పనులు ఆగిపోయాయి… వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
Also Read:బిడ్డను కంటే రూ.92 వేలు..ఎక్కడో తెలుసా?