భారత్‌ను డిజిటల్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ ఇండియా అనే కార్యక్రమాన్ని రెండేళ్ల క్రితం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ కు రాజస్థాన్‌లో తమ డిజిటల్ ఇండియా ఫలాలు కనిపించకపోవడంతో షాక్ తిన్నాడు. తన పార్లమెంట్ నియోజకవర్గం బికనూర్ లోని ఓ గ్రామానికి వెళ్లిన ఆయనను ఫోన్ సిగ్నల్స్ తెగ ఇబ్బంది పెట్టాయి. గ్రామంలోని ప్రజలు వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి తెలుపగా.. ఆయన సంబంధిత అధికారులకు ఫోన్ చేశాడు. అయితే.. ఆ గ్రామంలో ఫోన్ సిగ్నల్స్ సరిగా రావట. అధికారులకు ఫోన్ చేస్తుంటే అస్సలు వాళ్లకు కనెక్ట్ అవ్వలేదట.
ఏం చేయాలో తెలియని మంత్రికి అక్కడే ఉన్న ఓ చెట్టు ఎక్కితే సిగ్నల్ వస్తుందని ఓ సలహా ఇచ్చారట గ్రామస్థులు. చెట్టు ఎక్కడానికి నిచ్చెనను కూడా ఏర్పాటు చేశారట. అధికారుల సాయంతో వెంటనే నిచ్చెనను పట్టుకొని చెట్టు ఎక్కి మరీ.. సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆర్డర్ జారీ చేశారు. ఆయన ఫోన్ ముగించగానే గ్రామస్థులు ఆయనను చప్పట్లతో.. పోగడ్తలతో ముంచెత్తారట. అంతేకాదు.. గ్రామంలో నెట్ వర్క్ ప్రాబ్లమ్ ను పరిష్కరించడానికి…రూ. 13 లక్షల తో మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేయడానికి నెట్ వర్క్ కంపెనీలతోనూ మాట్లాడాడట మంత్రి. 62 ఏళ్ల వయసులో అతి కష్టం మీద నిచ్చెనతో చెట్టు ఎక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ అధికారులతో ఫోన్ లో మంత్రి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.
https://youtu.be/TxtbcW-KMi0