బాహుబలి-2 విజయం దక్షిణాది సినీ వాతావరణాన్నే మార్చివేసింది. దాదాపు దేశవ్యాప్తంగా విడుదలైన బాహుబలి2 రూ. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0ను పదిహేను భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మొదట ఐదు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించిన చిత్రబృందం ప్రస్తుతం 15 భాషల్లో విడుదల చేసే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
రజనీకాంత్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జపనీస్, చైనీస్, కొరియన్తో పాటు వివిధ విదేశీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడువేల థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆక్టోబర్‌లో విడుదల కావాల్సిన రోబో2.0ను జనవరికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచానాలు వున్నాయి. గతంలో వచ్చిన ‘రోబో’ సంచలన విజయాన్ని సాధించడమే అందుకు కారణం. అంతకు మించిన సక్సెస్ ను ఈ సినిమా అందుకోవాలనే దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో చిత్ర దర్శకనిర్మాతలు పావులు కదుపుతున్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అమీజాక్సన్ కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.