వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంటాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.ఆయన మాట మీద నిలిచే రకం కాదు. ఒక ఇంటర్వ్యూలో మొదట ఒక మాట చెప్పి.. చివరికి వచ్చేసరికి దానికి భిన్నంగా ఓ మాట చెప్పి.. అదేంటని అడిగితే ఇందాక చెప్పింది మీరు నమ్మేశారా అని అడిగిన వ్యక్తి వర్మ. అందుకే వర్మ చెప్పే చాలా విషయాల్ని జనాలు నమ్మరు. తాను ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా వారం కిందట వర్మ చెబితే.. అది జస్ట్ జోక్ అనే అనుకున్నారంతా. 30 లక్షల మంది ఫాలోవర్లను వదులుకుని ఎక్కడికి వెళ్తాడులే అని తేలిగ్గా తీసుకున్నారు. అప్పటికి వర్మ ట్విట్టర్ అకౌంట్ డిజేబుల్ అయినప్పటికీ.. ఆయన కచ్చితంగా తిరిగి ట్విట్టర్లోకి వస్తారనే ఆశించారంతా. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మళ్లీ ట్విట్టర్లోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. అందుకు కారణాలేంటో కూడా వర్మ వివరించాడు.
‘‘నాకు జనాల్ని ఇరిటేట్ చేయడమంటే ఇష్టం. అందుకే ట్విట్టర్లోకి వచ్చాను. నేను ఇరిటేట్ చేయాలనుకున్న వాళ్లను ఇరిటేట్ చేశాను. ఐతే ఆ వ్యక్తులూ నాకు బోర్ కొట్టేశారు. నాకు నేనూ బోర్ కొట్టేశాను. అందుకే ట్విట్టర్లోంచి వచ్చేశా. ఇన్ స్టా గ్రామ్ ఇప్పుడు నాకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది. దాని రూపంలో నాకు కొత్త బొమ్మ దొరికినట్లు అనిపిస్తోంది. ఈ ట్రెండుకు తగ్గట్లుగా ఫొటోలు.. వీడియోలతో మనం చెప్పాలనుకున్నది కన్వే చేయడం బాగుంటుందనిపించింది. ట్విట్టర్లో లాగా ఇక్కడ ప్రేలాపనలు కుదరవు.
మరి ట్విట్టర్లో ఫాలోవర్లు ఏమైపోతారో అనే బెంగేమీ లేదు. వాళ్లందరూ నన్ను ఇష్టపడి వచ్చినవాళ్లు కాదు. నన్ను తిట్టడానికే చాలామంది అక్కడున్నారు. వాళ్లు నాతో పాటు చాలామందిని ఫాలో అవుతుంటారు. కాబట్టి నన్ను మిస్సయ్యే ఛాన్సే లేదు. ట్విట్టర్లో చాలామందిని హర్ట్ చేశాను. వాళ్లందరికీ నిజాయితీగా సారీ చెబుతున్నా. నాగబాబు.. పవన్ కళ్యాణ్ లకూ సారీ చెబుతున్నా. వాళ్ల విషయంలో నేను చాలా అపరిపక్వంగా మాట్లాడానని అనుకుంటున్నా. ఎవరినీ హర్ట్ చేసే హక్కు నాకు లేదు. నేను ట్విట్టర్ నుంచి వెళ్లిపోవడానికి నాగబాబు ఇష్యూ కూడా ఒక కారణమే’’ అని వర్మ తెలిపాడు.