లక్కీ భాస్కర్..రిలీజ్ డేట్ ఫిక్స్

8
- Advertisement -

ప్రఖ్యాత నటుడు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా కెరీర్‌ను ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ అనతి కాలంలోనే తన ప్రత్యేకతను చాటుకొని, వివిధ భాషల ప్రేక్షకుల మనసు గెలుచుకొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. మలయాళ చిత్ర సీమకే పరిమితం కాకుండా పాన్ ఇండియా నటుడిగా ఎదిగారు. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో దుల్కర్ మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ “లక్కీ భాస్కర్” అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ “లక్కీ భాస్కర్” సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా “లక్కీ భాస్కర్” చిత్రం సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

తొలిప్రేమ, సార్/వాతి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి మెస్మరైజింగ్ విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ నూలి పనిచేస్తున్నారు.

1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ యొక్క ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇక ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Also Read:ముగిసిన వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాలు

- Advertisement -