2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేపట్టిన పథకాలను ఆపలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్…ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్స్ పథకాన్ని కొనసాగించామన్నారు. శాసనసభలో ఇదే విషయాన్ని తాను స్వయంగా వెల్లడించి పెద్ద మనసు చాటుకున్నానని తెలిపారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం…చక్కగా నడుస్తున్న పథకాలకు మోకాలడ్డుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిని తొలి రోజుల్లో కరెంట్ బాధలు వర్ణణాతీతం అని..కానీ ఆ సమస్యను కొద్దిరోజుల్లోనే అధిగమించామన్నారు. పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. పదేళ్లలో అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చి దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దామని తెలిపారు. కానీ ఇవాళ నాలుగు నెలల్లో కరెంట్‌ని ఆగం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
రాత్రిపూట కరెంట్‌తో రైతులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ రాష్ట్ర భవిష్యత్‌కైనా కరెంట్ కీలకమని కానీ దానిని దెబ్బ తీశారన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చిన్న వర్షానికే గంటల పాటు కరెంట్ పోయే పరిస్థితి నెలకొందని విమర్శించారు. న్యూయార్క్,లండన్‌లో కరెంట్ పోతది కానీ హైదరాబాద్‌లో కరెంట్ పోదనే స్థితికి తీసుకొచ్చామని కానీ ఇప్పుడు ఇన్వర్టర్లు కొనుక్కునే స్థితి వచ్చిందన్నారు. కరెంట్ లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని…ఇది బాధాకరమన్నారు. రైతులు చనిపోయారు, పంటలు ఎండిపోయాయి, మోటార్లు కాలిపోయాయని మండిపడ్డారు. పరిశ్రమలు ఇప్పుడు తెలంగాణ నుండి తరలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.

