తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన “లంకల రత్న” అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.”గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు.
ఈ సందర్భంగా కథానాయకుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మా టీమ్ అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాం. ఏడాదిలో సినిమాని పూర్తి చేసి, అద్భుతమైన అవుట్ పుట్ తో మీ ముందుకు వస్తున్నాం. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీరు చూసింది ఒక్క శాతమే. సినిమా మీ అంచనాలకు మించేలా ఉంటుంది. ఇది నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా.. అందుకేనేమో భయంతో పెద్దగా మాటలు రావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమా తరువాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది. ఇంత మంచి సినిమాని నాతో చేసిన నిర్మాత నాగ వంశీ గారికి నా కృతజ్ఞతలు. అలాగే వెంకట్ గారు, గోపీచంద్ గారు చిత్రీకరణ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కృష్ణ చైతన్య గురించి సినిమా విడుదలకు మాట్లాడతాను. అందమైన కథానాయికలు నేహా శెట్టి, అంజలి గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తాను.. ఈసారి శివాలెత్తిపోద్ది. అలాగే మన పేరుకి న్యాయం చేసే సమయం వచ్చింది. అదే ఈ సినిమా. మే 17న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “ఇది చాలా రోజుల తర్వాత విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మొదటి షో కి తెలిసిపోతుంది. ఈ ఎన్నికల హడావుడి ముగిశాక ట్రైలర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచుతాం. టిల్లు స్క్వేర్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం.” అన్నారు.
కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. “ఇప్పటినుంచి నేను రాధికను కాదు.. బుజ్జి. మీ అందరికీ టీజర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీకు కొంచెం చూపించాము. సినిమాలో దీనికి వంద రెట్లు ఉంటుంది. మీ అందరికీ ఈ సినిమా చాలా నచ్చుతుంది.” అన్నారు.
ప్రముఖ నటి అంజలి మాట్లాడుతూ.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది నా కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. నేను రత్నమాల అనే అద్భుతమైన పాత్ర పోషించాను. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. విశ్వక్ సేన్, నేహా శెట్టితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను.” అన్నారు.
Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!