ఎన్నికల మేనిఫెస్టో విషయంలో వైఎస్ జగన్ తప్పు చేశారా ? వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలు పెదవి విరుస్తున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం దక్కడం వెనుక ఆ పార్టీ మేనిఫెస్టోనే కీలక పాత్ర పోషించింది. నవరత్నాల పేరుతో జగన్ ఇచ్చిన హామీలు బలంగా ప్రజలను ఆకర్షించాయి ఫలితంగా ఎన్నికల్లో వైసీపీ కనీ విని ఎరుగని రీతిలో విజయం సాధించింది. దాంతో ఈసారి ఎన్నికల వేళ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో అనే చర్చ జోరుగానే సాగింది. మేనిఫెస్టో విషయంలో పార్టీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావడంతో అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఎట్టకేలకు తాజాగా జగన్ చేతుల మీదుగా వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే మేనిఫెస్టోలో కొత్తగా అమలు చేయబోయే హామీలేవీ లేకపోవడంతో ఒక్కసారిగా అందరిలోనూ చర్చ మొదలైంది.
ఆల్రెడీ అమలులో ఉన్న హామీలనే అలాగే కొనసాగిస్తూ, పెంచుతూ మేనిఫెస్టో ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. అమ్మ ఒడి రూ.15 వేల నుంచి 17 వేలకు పెంచడం, రైతు భరోసా రూ.13,500 నుంచి 16 వేలకు పెంపు, వృద్ధాప్య పెన్షన్ రెండు విడతల్లో పెంపు.. ఇలా ఆయా పథకాల నిధులను పెంచారు. అలాగే అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, షాదీ తోఫా, కళ్యాణమస్తు వంటి పథకాలను కొనసాగిస్తున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇలా తాజా మేనిఫెస్టోలో ప్రకటించిన చాలా హామీలు ఆల్రెడీ అమల్లో ఉన్నవే కావడంతో మేనిఫెస్టోపై ప్రజలు పెదవి విరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ ప్రకటించిన హామీలతో పోల్చితే జగన్ మేనిఫెస్టో విషయంలో మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదనే అభిప్రాయాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. మరి రెండో సారి అధికారంతో పాటు 175 స్థానాల్లో విజయం సాధించే లక్ష్యంతో ఉన్న వైసీపీకి తాజా మేనిఫెస్టో ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Also Read:స్కిన్ అలర్జీ..అయితే జాగ్రత్త!