లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రధాని అభ్యర్థి అంశం గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నప్పటికి అధికారికంగా ప్రకటించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని అభ్యర్థి విషయంలో ఏకీకృత నిర్ణయం ప్రకటించడానికి వీలు లేదు. దాంతో ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి అంశం ఒక పెద్ద సస్పెన్స్ లా మారింది. అటువైపు ఎన్డీయే కూటమి నుంచి నరేంద్ర మోడీనే మరోసారి ప్రధాని అభ్యర్థిగా ఉండడంతో ఆయన ఫోటో చూపిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కమలనాథులు. కానీ ఇటువైపు ఇండియా కూటమి పరిస్థితి అలా లేదు. ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఇండియా కూటమిలో అనిశ్చితి కొరవడింది.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రధాని అభ్యర్థిని ఎన్నుకుంటామని రాహుల్ గాంధీ ఆ మద్య వ్యాఖ్యానించిన సంగతి విధితమే. అయితే ఈ వ్యాఖ్యలతో సంబంధం లేకుండా ప్రధాని అభ్యర్థి విషయంలో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. వయోనాడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని, రాబోయే 20 ఏళ్ళు ఆయనే దేశ ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు. దీంతో ఇండియా కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే రేవంత్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని కూటమిలోని ఇతర పార్టీల నేతలు వాపోతున్నారాట. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని అభ్యర్థి విషయంలో మౌనం వహిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధే ప్రధాని అభ్యర్థి అన్నట్లుగా వ్యవహరించడం సరికాదనేది కూటమిలోని ఇతర నేతల అభిప్రాయం. మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కూటమిలో అనిశ్చితి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:Jagadish Reddy:కేసీఆర్ జోలికి వస్తే తరిమేస్తాం