తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ బెంగళూరులో చెప్పారు. ఆయన ఏ పార్టీలోనూ చేరబోరని, సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారని తెలిపారు. పార్టీ పేరు, విధివిధానాలపై రజనీ కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
సత్యనారాయణరావ్ గైక్వాడ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవలే అభిమానులతో భేటీ అయిన రజనీకాంత్.. జూన్, జులై నెలల్లో తమిళనాడులోని దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన అభిమానులు, ముఖ్యులతో రజనీ భేటీ అవుతారని చెప్పారు. జూలైలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్న రజనీకాంత్ ఆ దిశగానే అభిమానులకు సూచనలు ఇస్తున్నారని అన్నారు. కాగా, అన్నాడీఎంకేకు రాజీనామా చేసిన నటుడు ఆనంద్‌రాజ్ శనివారం రజనీకాంత్ తో సమావేశమయ్యారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆనంద్‌రాజ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళ రవి మణియన్ కూడా రజనీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
‘కాలా కరికలన్’ చిత్రం చిత్రీకరణ ఆదివారం నుంచి మొదలవుతున్న సందర్భంగా శనివారం ముంబయికి బయల్దేరిన రజనీకాంత్ పోయెస్‌గార్డెన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నా వృత్తి నటన. నా పని నన్ను చేసుకోనివ్వండి’… అని, ‘నటించడం నా వృత్తి. మీరు (విలేకరులు) మీ పనిని చేస్తున్నారు’ అంటూ ఇతర ప్రశ్నలకు ఆస్కారం కల్పించలేదని ముక్తసరిగా ముగించి, విమానాశ్రయానికి వెళ్లిపోయారు.