తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేషన్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. అసోషియేషన్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విషయానికి వస్తే సభ్యుడికి రూ.15 లక్షలు, యాక్సిడెంటల్ పాలసీ సభ్యుడికి రూ.25 లక్షలను అందేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించడం జరిగింది.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ `మనం ప్రజల పక్షాన పనిచేస్తున్నామనే భావన జనాలకు కలగజేయాలి. తెలంగాణలో 23వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి సంస్థలోనూ ఫిల్మ్ జర్నలిస్టులకు ప్రత్యేకంగా అక్రిడేషన్ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. ఇళ్ల స్థలాలను ఇస్తామని గత ప్రభుత్వం ఆశపెట్టింది. నెరవేరలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తారన్న ఆశ ఉంది. ఎలిజెబుల్ పీపుల్‌కి కచ్చితంగా అక్రిడేషన్ ఇప్పిస్తాం. 40 ఏళ్ల అక్రిడేషన్‌కి క్రితం రూల్స్ పెట్టినప్పుడు, ఆ తర్వాత మార్పు చేసినప్పుడు కూడా నాకు తెలుసు. ప్రభుత్వాల నుంచి ఏ సౌకర్యాలు పొందాలన్నా అందరిలోనూ యూనిటీ ఉండాలన్నారు. జూన్ 6 తర్వాత ఎలిజిబుల్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించే ప్రయత్నం చేస్తాం అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ జర్నలిస్టులకు శ్రీనివాసరెడ్డిగారు ల్యాండ్‌లు ఇప్పిస్తే, అందరూ ఆనందంగా ఉంటారు. జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్‌లో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాసరెడ్డిగారు ఇన్ని మాట్లాడుతుంటే నాకు చాలా విషయాలు తెలిశాయి. ఆయన చాలా స్ట్రాంగ్ గైడ్ అనిపిస్తోంది. నా కెరీర్ మొదటి నుంచీ జర్నలిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మెడికల్ బిల్లులు ఎక్కువ వస్తాయేమోనని భయపడి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువల్‌కి డబ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వదిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపించింది. జీవితంలో ఎవరికైనా మూడే ముఖ్యం. ఒకటి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డబ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నేను మీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తాను అని అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లను ఫ్రీగా ఇప్పించండి. స్థలాలను రేవంత్‌రెడ్డిగారిని అడగండి. ఇళ్లు మీరు కట్టుకోండి. శ్రీనివాసరెడ్డిగారు స్థలాలను ఇప్పించి పుణ్యం కట్టుకోవాలి. తుపాకి కన్నా కలానికి భయపడతానని అన్నారు నెపోలియన్. ఎంతో మంది జర్నలిస్టులను కన్నది సినిమా తల్లి. ఆ రోజుల్లో వారం రోజులకు తర్వాతే రివ్యూలు రాసేవారు. కానీ ఇప్పుడు మార్నింగ్ షోకే రాస్తున్నారు. ఇవాళ సినిమా మూడు రోజులే బతుకుతోంది. సినిమా గురించి రాస్తున్నప్పుడు దయచేసి సినిమాను చంపేయకండి. కేరక్టర్ అసాసినేషన్ చేయకండి. నన్నని కాదు.. ఎవరి గురించైనా రాసేటప్పుడు ఆలోచించి రాయండి. దయ ఉంచి తప్పుడు రాతలు రాయకండి. సినిమా ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీలో 90 శాతం సగటు నిర్మాతలున్నారు. కానీ 10 శాతమే విజయం ఉంది. మిగలిన 90 శాతం ఎలా ఉంది? మీడియాలో భారీ సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటి? అన్నీ చూడండి.. అందరినీ ప్రోత్సహించండి అని అన్నారు.
Also Read:KCR:కేజ్రీవాల్ అరెస్ట్ చీకటిరోజు