శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం( చిన్నపిల్లల గుండె ఆసుపత్రి) వైద్యులు 12వ గుండె మార్పిడి శస్త్ర చికిత్సను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను పూర్తిచేసిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలోని వైద్యబృందాన్ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా రాజోలుకు చెందిన కె.ధర్మారావు(28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో అక్కడి జెమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ యువకుడికి బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు గుర్తించారు. సదరు యువకుడి అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఇతర ఆసుపత్రులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా వైజాగ్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి డైలేటెట్ కార్డియోమయోపతి వ్యాధితో గుండె పోటుకు గురయ్యే స్థితిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చికిత్స పొందుతున్నాడు. అవయవదానం సమాచారం అందుకున్న శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి గుండె మార్పిడికి ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటలకు వైద్యబృందం గుండెను సేకరించి ప్రత్యేక ఏర్పాట్లతో శ్రీకాకుళం రాజోలు నుండి గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్డు మార్గంలో వైజాగ్‌కు బయల్దేరారు. వైజాగ్ నుండి రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి రాత్రి 10.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాత్రి 10.05 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటినుండి ప్రారంభించి ఫిబ్రవరి 27న మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?