TTD:ఉద్యోగుల జీతాలు పెంపు..రమణ దీక్షితులు ఔట్

17
- Advertisement -

టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధర్మకర్తల మండలి సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలో వివిధ విభాగాల‌లో అన్‌స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌, స్కిల్డ్‌, హైలీస్కిల్డ్‌ కేట‌గిరీల్లో ప‌నిచేస్తున్న కార్పొరేష‌న్‌, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న 9 వేల మందికి వేత‌నాలు పెంచేందుకు బోర్డు నిర్ణ‌యం తీసుకుంది.

– గాలిగోపురం, 7వ మైలు శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహం, మోకాళ్లమిట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని వీనులవిందుగా వినిపించేందుకు ‘‘నిత్య సంకీర్తనార్చన’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం. అదేవిధంగా తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా ‘‘నిత్య సంకీర్తనార్చన’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం.

– టీటీడీ ఆధ్యర్యంలో తిరుపతి పుట్టినరోజు పండుగను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం. అదేవిధంగా టీటీడీ క్యాలెండరులో ఈ పవిత్ర రోజును చేర్చాలని నిర్ణయం.

– తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి అనుమతి మేరకు, అదేవిధంగా ఆలయ ప్రధానార్చకుల సూచనల మేరకు శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలు ఉండే తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో రూ.1.69 కోట్లతో నూతనంగా బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటుకు ఆమోదం.

– గత బోర్డులో భక్తులకు శ్రీవారి వివాహకానుకగా వివిధ డిజైన్లలో మంగళ సూత్రాలు, లక్ష్మీకాసులు 4 గ్రా., 5 గ్రా., 10 గ్రా. వంటి 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు రూ.4 కోట్లతో నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం.

– హిందూ సనాతన ధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు ఇచ్చిన సలహాలు, సూచనలను బోర్డు ఆమోదించడమైనది.

– టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీశ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సోసైటిలకు బదిలీ చేసి, వారి వేతనాలు పెంచి, బస్సు పాసులు ఇచ్చేందుకు ఆమోదం.

– వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్లస్థలాల లేఔట్‌ మరియు ఇతర అభివృద్ధి చార్జీలకు సంబంధించి రూ.8.16 కోట్లు తుడాకు చెల్లించేందుకు ఆమోదం. ఈ మొత్తాన్ని టీటీడీ ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు.

Also Read:అనాసతో ఆరోగ్య ప్రయోజనాలు!

– తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రూ.3.89 కోట్లతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు.

– అలిపిరి వద్దగల సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబరు 23వ తేదీ నుండి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌ నుండి రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం. ఇందుకోసం టీటీడీ బోర్డు స‌భ్యుడు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి రూ.1.38 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకువ‌చ్చారు.

– శ్రీలంకలోని కొలంబో సమీపంలో గల శ్రీ మయూరపతి, శ్రీ భద్రకాళి అమ్మన్‌ ఆలయ ట్రస్టు అధ్యక్షులు శ్రీ సుందరలింగం, అక్కడి పుట్టాలం జిల్లాలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి అవసరమైన సలహాలు, సూచనలు టీటీడీ ఇస్తుంది. అదేవిధంగా శ్రీలంకలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు నిర్ణయం.

– తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూప్రసాదాల తయారీకి శ్రీవారి పోటులో అదనంగా మరో 15 మంది పోటు సూపర్‌వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి ఆమోదం.

– తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 1, 4వ బ్లాకుల ఆధునీకరణకు రూ.3.19 కోట్లు మంజూరుకు ఆమోదం.

– తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్‌ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.3.15 కోట్లు మంజూరు చేసేందుకు ఆమోదం.

– తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అతిధి భవనాలు, పీఏసీలలో ఎఫ్‌ఎంఎస్‌ సేవలను మరో మూడు సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం.

– తిరుపతిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా రూ.15 లక్షలతో రెండు తండ్లకు బంగారు మలాం వేసిన కాపర్‌ రేకులు ఏర్పాటు చేసేందుకు ఆమోదం.

– శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి చెల్లిగా ప్ర‌సిద్ధి చెందిన తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో గ‌తేడాది లాగే జాత‌ర నిర్వ‌హ‌ణ‌కు రూ.50 లక్షలు మంజూరుకు ఆమోదం.

– టీటీడీ ఆస్థాన సిద్ధాంతి శ్రీ తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్‌ సిద్ధాంతి పదవీ కాలాన్ని మరో మూడు సంవత్సరాలు పొడిగించేందుకు ఆమోదం.

– టీటీడీ గత ఏడాది జమ్మూలో నిర్మించిన శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏని పెంచేందుకు ఆమోదం.

– తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని ఇన్‌కమ్‌ టాక్స్‌ గెస్ట్‌ హౌస్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో రూ.7.51 కోట్లతో నూతన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఆమోదం.

– బాలబాలికల్లో ధార్మిక, నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభశైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 98 లక్షలు కాపీలు ముద్రించేందుకు రూ.3.72 కోట్లు మంజూరుకు ఆమోదం.

– స్విమ్స్‌(శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ)కు అనుబంధంగా ఉన్న శ్రీపద్మావతి జనరల్‌ ఆసుపత్రిలో మార్చి 1 నుండి జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, మానసిక వ్యాధులు, పీడియాట్రిక్స్‌ వంటి ప్రత్యేక విభాగాలతోపాటు జ్వరాలు, వాంతులు, విరేచనాలు లాంటి సాధారణ వ్యాధులకు కూడా ఇకపై ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగులకు నగదురహిత వైద్యసేవలను అందించేందుకు నిర్ణయం.

– టీటీడీలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, సొసైటీల్లోని సిబ్బందికి, వర్క్‌ కాంట్రాక్టు పరిధిలోని ఎఫ్‌ఎంఎస్‌, పారిశుద్ధ్య సిబ్బందికి తిరుమలలోని ఉద్యోగుల క్యాంటీన్‌లో రాయితీపై అల్పాహారం, భోజనం సదుపాయం కల్పించేందుకు ఆమోదం.

– తిరుమలలోని ఎస్వీ ఎంప్లాయిస్‌ క్యాంటీన్‌లో వంటశాల మరియు భోజనశాల విస్తరణకు రూ.8.15 కోట్లు, అవసరమైన వంట సామగ్రి కొనుగోలుకు రూ.3 కోట్లు మంజూరుకు ఆమోదం.

– అన్నప్రసాద విభాగంలో సూపర్‌వైజరీ పోస్టుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు ఆమోదం. కిందిస్థాయి పోస్టులను కార్పొరేషన్‌ లేదా ఔట్సోర్సింగ్‌ ద్వారా నియామకానికి ఆమోదం.

– టీటీడీ అధికారులు, పాల‌క‌మండ‌లి, జియ్యంగార్లు, అర్చ‌కులతోపాటు అహోబిల మ‌ఠంపై నిందారోప‌ణ‌లు చేసిన గౌర‌వ ప్ర‌ధానార్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితుల‌ను ఉద్యోగం నుండి తొల‌గించాల‌ని బోర్డు తీర్మానం.

– అలిపిరి కాలిన‌డ‌క మార్గంలోని గాలిగోపురం, శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్దగ‌ల ముగ్గుబావుల ఆధునీక‌ర‌ణ‌కు నిర్ణ‌యం.

- Advertisement -