‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ప్రీ రిలీజ్ కమ్ ఆడియో లాంచ్ ఈవెంట్లో ప్రముఖ సినీ నటుడు చలపతిరావు ”అమ్మాయిలు హానికరం కాదు కాని.. పక్కలోకి పనికొస్తారు” అని చేసిన కామెంట్ ఒక్కసారిగా అగ్గిరాజేసింది. దాంతో పలు మహిళా సంఘాలు చలపతిరావు పై నిప్పులు చెరిగాయి.
ఆయన చేసిన చెత్త కామెంట్ వల్ల ఆయన పై కేసులు కూడా పెట్టారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళపై ఎంత నీచంగా కామెంట్స్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నామని, ఇకనైన ఇలాంటి నీచపు బుధ్దిని మానుకోవాలని పలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
ఇదే క్రమంలో చలపతి రావు కామెంట్‌ను ఇప్పటికే ప్రముఖులు ఖండిస్తున్నారు. సీనియర్ నటుడైన చలపతిరావు అమ్మాల గురించి ఇలా కామెంట్ చెయ్యడం సబబుకాదని సున్నితంగా చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు.
చలపతిరావు చేసిన కామెంట్ ని వ్యతిరేకించిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కింగ్ నాగార్జున గురించి.. చలపతిరావు చేసిన కామెంట్ పై ఆయన వాటిపై పశ్చాత్తాపం పడకుండా సైలెంట్ గా ఉంటాడేమో కాని.. తను ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈవెంట్లో జరిగింది కాబట్టి.. నాగార్జున్ మాత్రం సైలెంటుగా ఉండలేకపోయారు.
అందుకే ఆయన సోషల్ మీడియా సాక్షిగా చలపతి రావు ఆ కామెంట్లను ఖండించారు. ”నేను నిజ జీవితంలోనైనా సినిమాల్లోనైనా ఆడాళ్లని చాలా గౌరవిస్తాను. చలపతిరావు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. డైనోసార్లు అనేవి ఇప్పుడు లేవు” అంటూ తెలివిగా చురకలు వేశారు నాగార్జున. ఈ విషయన్ని ఈరోజు ఉదయం ఆయన ట్వీట్ ద్వార తెలియజేశారు.
ఇక ఇదిలా ఉంటే.. ఆడవాళ్ళ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేగడంతో చలపతిరావు వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, ట్రంప్, ఒబామా.. ఇలా ఏ ప్రముఖులను చూసినా, తనలాంటి వారిని తీసుకున్నా స్త్రీ సేవలు మరువలేనివని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటో తనకు తెలియదని ఆయన చెప్పారు.
ఆడవాళ్లు పక్కలోకి పనికొస్తారంటే… కేవలం సెక్స్ మాత్రమే కాదని ఆయన చెప్పారు. అంతకంటే ఎన్నో ఉన్నత భావాలు చాలా ఉంటాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. మరి ఆ ఉన్నత భావాలు ఏంటో? చలపతిరావే సెలవివ్వాలి.
మొత్తానికి మొన్న కమెడియన్ ఆలీ.. ఇప్పుడు చలపతిరావు.. ఇలా ఆడవాళ్ళపై చీప్ కామెంట్స్ ను పాస్ చేయడం తెలుగు ఇండస్ర్టీలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇకపోతే నాగార్జున వంటి పెద్ద స్టార్ బాధ్యాతాయుతంగా ఇలాంటి వాటిని ఖండించడం.. చెప్పుకోదగిన విషయం. మిగిలిన వారికి కూడా ఇలాంటి వల్గర్ కామెంట్లని ఖండించే సద్దుద్యేశాలు ఉంటేనే ఇకనుంచైనా ఆడవాళ్ళపై చేసే ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు కాస్త అయినా తగ్గుతాయి.