మన శరీరంలో కన్ను చాలా విలువైనది. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెబుతూ ఉంటారు. అంటే మన శరీరంలోని అవయవాలన్నిటిలో కళ్ళు చాలా ముఖ్యమైనవని దాని అర్థం. అందుకే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. నేటి రోజుల్లో చిన్న వయసులోనే కంటి సమస్యలతో బాధ పడుతుంటారు చాలమంది. చూపు తక్కువగా ఉండడం. కళ్ళు తరచూ మంటగా అనిపించడం, ఎర్రబడడం.. ఇలా చాలా సమస్యలే కళ్ళను వేధిస్తుంటాయి. అయితే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మన ఆహారపు అలవాట్లు ప్రదానమైనవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మనం తినే ఆహారంలో విటమిన్లు, బీటా కెరోటీన్లు, ఇతరత్రా పోషకాలు ఉండేలా చూసుకుంటే కంటికి ఎంతో మంచిదట. .
బాదం, ఆవిసె గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు వంటి వాటిలో విటమిన్ ఏ, ఇ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళలోని కణాలను రక్షించి కంటి సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి వీటిని ప్రతిరోజూ తీసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా నారింజ, బత్తాయి, నిమ్మ వంటి వాటిలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ, బి కాంప్లెక్స్.. కూడా ఉంటుంది. ఇవి కంటి శుక్లాలను తగ్గించి ఇతర నేత్ర ప్రమాదాన్ని తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి.
కాబట్టి ఆహార డైట్ లో వీటిని భాగం చేసుకోవాలి. ఇంకా ఒమేగా 3 ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా వంటి చేపలను తినడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుందట. ఇవే కాకుండా ఆకు కూరలు ప్రధానంగా కంటి చూపును మెరుగుపరచడంలోనూ కంటి సమస్యలను దూరం చేయడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి కంటి ఆరోగ్యానికి వీటన్నిటిని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఎక్కువ సేపు మొబైల్, కంప్యూటర్ చూడడం, కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటి చూపు పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:త్వరలోనే ప్రధానిని కలుస్తాం:సీఎం రేవంత్