“రారండోయ్ వేడుక చూద్ధాం” ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహిళలను ఉద్దేశించి సీనియర్ నటులు చలపతిరావు చేసిన వ్యాఖ్యలను చిత్ర కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. ఒక సీనియర్ నటుడు మాత్రమే కాక ఇండస్ట్రీ పెద్ద స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి అసభ్యకర వ్యాఖలు చేయడం సమంజసం కాదని, ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు తనకు సరిగా అర్ధం కాక మిన్నకుండిపాయానే కానీ.. అర్ధం తెలిసి ఉంటే అప్పుడే, అక్కడే చలపతిరావు వ్యాఖ్యలను తప్పుబట్టి ఉండేదాన్నని రకుల్ ప్రీత్ తెలిపారు.
ఇకనుంచైనా చలపతిరావు ఆయన వయసుకు తగ్గట్లుగా మాట్లాడాలని, లేదంటే ఆయన వ్యాఖ్యల కారణంగా ఇండస్ట్రీ గురించి బయటివారు తప్పుగా అనుకొనే అవకాశాలున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఆయన వయసుకి, అనుభవానికి తాను చెప్పేటంతటిదాన్ని కానప్పటికీ.. ఇలాంటి వ్యాఖ్యల పట్ల స్పందించకపోవడం కూడా తప్పే అని భావించి ఈ పత్రికా ప్రకటనను విడుదల చేస్తున్నట్లు రకుల్ ప్రీత్ వెల్లడించారు.
నాగచైతన్య,రకుల్ జంటగా తెరకెక్కిన సినిమా రారండోయ్ వేడుకచూద్దాం. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతిరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరమా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ‘అమ్మాయిలు హానికరం కాదుకాని.. పక్కలోకి పనికొస్తారు అంటూ కామెంట్ చేశాడు. దాంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.