ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నాం అన్నారు. దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారు.
పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు.తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కల్యాణ వేదికలో యువ కళాకారులతో ‘‘శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలిక’’ సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
Also Read:INDvsENG : టార్గెట్.. డబుల్ సెంచరీ!