తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ రకమైన వార్తలు బాగానే వినిపించాయి. ఎందుకంటే గతంలో టీడీపీలో పని చేసిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు కాంగ్రెస్ లో ఉండడం ఒక కారణమైతే.. వీరు టీడీపీ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఈ రెండు పార్టీల మద్య అంతర్గత పొత్తు ఉందనే టాక్ వినిపిస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీని గతంలో కలిసి పని చేసిన పార్టీగానే చూస్తున్నానని అంతకు మించి ఆ పార్టీలో కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి గతంలో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి టీడీపీ కాంగ్రెస్ మద్య ఏదో ఉందనే చర్చ జరుగుతూనే వచ్చింది. ఇక ఏపీ విషయానికొస్తే అక్కడ కూడా కాంగ్రెస్ టీడీపీ కలిసి పని చేస్తున్నాయని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం టీడీపీ చేసిన కృషి చాలా ఉందని, 119 స్థానాల్లోనూ కాంగ్రెస్ కు టీడీపీ మద్దతుగా నిలిచిందని ఖమ్మం ఎన్టీఆర్ భవన్ లో పొంగులేటి వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఇరు పార్టీలు ఇలాగే సమన్వయంతో ఉండాలని, భవిష్యత్ లో కూడా కలిసి పని చేద్దామని పొంగులేటి వ్యాఖ్యానించడం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. దీంతో లోక్ సభ ఎన్నికల్లోనూ, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేసేలా కాంగ్రెస్ నేతలు అడుగులు వేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరు పార్టీల మద్య పొత్తు పరోక్షంగా ఉంటుందా లేదా ప్రత్యక్షంగా తెరపైకి వస్తుందా అనేది ఆసక్తికరం. ఒకవేళ ఈ రెండు పార్టీల మద్య పొత్తు నిజమైతే ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:విజయ్ పై రష్మిక కొత్త ముచ్చట్లు