IND vs ENG :రోహిత్ సేనకు కఠిన పరీక్షే..?

34
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇరుజట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. తొలి టెస్ట్ ఓటమితో డీలాపడ్డ టీమిండియా రెండో టెస్టులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ సేనకు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లయిన రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన ఈ ఇద్దరు రెండో టెస్టులో అందుబాటులో లేకపోవడం కొంత నిరుత్సాహపరిచే విషయమే. పైగా జట్టులో ఉన్న ఆటగాళ్లు సైతం పెద్దగా ఫామ్ లో లేకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది.

వన్డేలలో అద్భుతంగా రాణించే శుబ్ మన్ గిల్ టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఈ ఇద్దరు లయ అందుకుంటే జట్టుకు తిరుగుండదు. ఇక గాయం కారణంగా దూరమైన జడేజా, రాహుల్ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. రాహుల్ స్థానంలో రజిత్ పాటిదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరు కొత్త బ్యాట్స్ మెన్స్ కావడంతో ఎంతవరకు రాణిస్తారనేది ప్రశ్నార్థకమే. ఇక ఆల్రౌండర్ల జాబితాలో జడ్డూ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనేది చూడాలి. జడ్డూ స్థానంలో కుల్దీప్ లేదా వాషింగ్టన్ సుందర్ ఇద్దరిలో ఎవరోఒకరు చోటు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక విశాఖలో టీమిండియా కు మంచి రికార్డే ఉంది. అయినప్పటికీ జట్టుకూర్పు రోహిత్ సేనను కలవరపెడుతోంది. మరి రెండో టెస్టులో రోహిత్ సేన ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : గ్లామర్ షో ఒలకబోసింది

- Advertisement -