త్రేతాయుగపు రాముడే అయోధ్యకు తిరిగి వచ్చినట్టుందని, రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని, తన జన్మ ధన్యమైందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ కరుణాకరరెడ్డి సోమవారం అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఛైర్మన్ మాట్లాడుతూ తనకు కలిగిన దివ్యానుభూతిని వ్యక్తం చేశారు.
ఆ భగవంతుడ్ని దర్శించుకోవడం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అందులోనూ ఈ రోజు తరతరాలుగా, ఓ కోరికగా మిగిలిన కల సాకారమైంది. ఒక విగ్రహ రూపంలో రాముడే అయోధ్యకు మళ్లీ దిగివచ్చినట్టుగా అనిపిస్తోంది. హిందువులందరినీ ఏకం చేసినట్లుగా, మనలో అంతా మానవతా విలువలు నింపి, ప్రపంచాన్ని మళ్లీ మార్చి, రామరాజ్యం తీసుకురావడానికి ఒక గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉందన్నారు భూమన.
ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరినీ ఏకతాటిపై నడిపించినట్టుగా ఉంది. ఆ నడిపించిన తీరు కూడా, సమతాభావనతో, సమానత్వపు ఆలోచనలతో, మానవాళికి అంతా మంచి జరగాలనే తపన ఇందులో దాగి ఉంది. ఆ దిశగా భవిష్యత్తు ఉంటుందని, అలా సాకారం అవుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత సంఘటితమైన శక్తిగా ఒక రూపాన్ని తీసుకున్న అంశం రామాలయమే అనిపిస్తోంది. పూర్తి చేసుకున్న రామాలయంలో ఈ రోజున మొత్తం భారతదేశంలో ఉన్న రామ భక్తులు, ప్రపంచంలో ఉన్న హిందువులు అంతా ఒక్కటై… రామనామ జపాన్ని చేస్తూ, జగమంతా రామమయం అనే నినాదంతో ముందుకెళుతున్నారు. అందరికీ మంచి జరిగేలా, ఏ ఒక్కరికీ అన్యాయం, దోపిడీ లేకుండా, దోపిడీ రహిత రాజ్యాన్ని నిర్మించటానికి రామ మందిరం ఒక గొప్ప తాత్విక ఉద్దేశంగా మారుతుందన్న నమ్మకం నాకు కలిగిందన్నారు.
Also Read:TTD:తిరుమలలో సనాతన ధార్మిక సదస్సు