కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తినిచ్చారు. మిసైల్ మ్యాన్ కలాం ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. తాజాగా కలాంకు మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా ఇటీవల ఓ కొత్త బ్యాక్టీరియాను కనుగొంది. ఈ తరహా బ్యాక్టీరియాను ఇప్పటి వరకూ భూమిపై గుర్తించలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫిల్టర్లలో ల్యాబ్ జెట్ ప్రొపల్షన్ లేబరోటరీ ఈ బ్యాక్టీరియాను గుర్తించింది. కొత్తగా కనుగొన్న ఈ బ్యాక్టీరియాకు.. అబ్దుల్ కలాం పేరిట ‘సోలిబాసిల్లస్ కలామి’ అని నామకరణం చేసింది. 40 నెలలుగా ఐఎస్ఎస్లో ఉంచిన ఫిల్టర్‌పై ఈ బ్యాక్టీరియా చేరింది. హెపా ఫిల్టర్‌గా పిలిచే దీన్ని ఐఎస్ఎస్లోని హౌస్ కీపింగ్, క్లీన్ వ్యవస్థల్లో ఉపయోగిస్తారు.
భూమికి 400 కి.మీ. దూరంలో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్లోని ఫిల్టర్‌పై 40 నెలల కిందట గుర్తించిన ఈ బ్యాక్టీరియాపై సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి వెంకటేశ్వరన్ సారథ్యంలో పరిశోధనలు సాగించారు. ఇది గతంలో భూమిపై ఎక్కడా కనిపించనప్పటికీ భూమికి వెలుపలి జీవరాశి కాదని, ఏదో సరుకుల ద్వారా ఐఎస్ఎస్లోకి చేరి మనుగడ సాగించగలిగిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1963లో నాసాలో శిక్షణ పొందిన కలాం, ఆ తర్వాత భారతలో తొలి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబ గ్రామంలో నెలకొల్పిన విషయాన్ని వెంకటేశ్వరన్ గుర్తు చేశారు.
ఫుట్‌బాల్ గ్రౌండ్ పరిమాణంలో విస్తరించి ఉండే ఐఎస్ఎస్ నిర్మాణాన్ని 1998లో ప్రారంభించారు. ఈ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు శాస్త్రవేత్తలు ఉండే వీలుంది. దీని నిర్మాణం కోసం 150 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇప్పటి వరకూ 227 మంది ఆస్ట్రోనాట్స్ స్పేష్ స్టేషన్‌కు వెళ్లారు. దీని బరువు 419 టన్నులు..