AP:రాజధానికి దారేది?

25
- Advertisement -

ఏపీలో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల రాజధాని విషయం గురించి ప్రస్తావిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పవన్ కూడా అమరావతే రాజధానిగా ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో మళ్ళీ రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ కోర్టు నుంచి అడ్డంకులు ఏర్పడడంతో ఆ ఆలోచన విరమించుకుని విశాఖను మాత్రమే రాజధానిగా ప్రకటించేందుకు గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. .

త్వరలో విశాఖ నుంచి పాలన ఆరంభం అవుతుందని, అక్కడ ప్రభుత్వ కార్యాలయ కట్టడాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో విశాఖకు తాను షిఫ్ట్ అవుతున్నట్లు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో విశాఖను రాజధానిగా ప్రకటించేందుకు ప్రభుత్వం చాలానే ఖర్చు చేసింది. అయితే ఇప్పటివరకు ఇంకా రాజధాని మార్పు జరగలేదు.

మరో నెల రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అంశం జగన్ పై ప్రతికూలత చూపే అవకాశం లేకపోలేదు. ఇంతలోనే చంద్రబాబు, పవన్ ఒకే నినాదంతో అమరావతి రాజధానికే తమ మద్దతు అని చెప్పడంతో జగన్ కూడా బ్యాక్ టు అమరావతి అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు జగన్ మళ్ళీ అమరావతికే జై కొడితే.. టీడీపీ, జనసేన పార్టీలకే ప్లెస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. మరి ఎన్నికల వేళ రాజధాని అంశం ఎవరికి ఎలాంటి రిజల్ట్స్ ను కట్టబెడుతుందో చూడాలి.

Also Read:దానిమ్మరసంతో ఆ సమస్యలు దూరం!

- Advertisement -