భారతీయ చిత్రపరిశ్రమలో అనితరసాధ్యమైన 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఏకైక సినిమా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’. ఈ సినిమాను అభిమానులంతా ఆకాశానికెత్తగా, తెలుగు చిత్రపరిశ్రమ ఈ సినిమాను మించిన సినిమా లేదని పేర్కొంది. సినీ పరిశ్రమలో దిగ్గజం నటుడైన కమల హాసన్ బాహుబలి-2పై వైవిధ్యభరితమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ కమల హాసన్ ఏమన్నారంటే…’బాహుబలి’ సినిమా మహాభారతానికి, తమిళ ఫాంటసీ టీవీ సిరీస్ ‘అంబులి మామ’కు నకలు అని వ్యాఖ్యానించాడు. .
ఇటీవల మీరు బాహుబలి వంటి మూవీ ఎప్పుడు చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నేనేమైనా గొర్రెనా.. బాహుబలి లాంటి సినిమా చేయడానికి.. కనీసం గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతి జంతువుని, ఏదో సినిమా హిట్ అయినంతమాత్రాన అలాంటి సినిమానే నేనూ చేయాలనే టైప్ కాదు’ అంటూ గొర్రె సామెత చెబుతూ బాహుబలిపై గుర్రాయ్యారు కమల్.
‘మరుదనాయగం’ సినిమా గురించి అభిమానులు తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తాను ఆ సినిమాను ఎప్పుడో పట్టాలెక్కించాలని భావించానని, అయితే ‘మర్మయోగి’ సినిమా మధ్యలో దూరి ఆ సినిమా ఆలోచనను మరింత వెనక్కి నెట్టిందని తెలిపాడు. సినీ పరిశ్రమలో అద్భుతమైన ఆలోచనలకు తలమానికమని చెప్పుకునేందుకు ఎవరూ లేరని, ఒకరిని చూసి మరొకరు స్పూర్తి పొందుతారని అన్నాడు. తాను కూడా ఏదైనా గొప్పగా చేయాలంటే మరొకరిని, లేదా మరొక సందర్భాన్ని చూసి స్పూర్తి పొందుతానని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. ‘బాహుబలి’ సినిమా తనపై ఎలాంటి ఒత్తిడి పెంచదని తేల్చిచెప్పాడు.

