కోట్లాదిమంది అభిమానులను అలరించిన ఐపీఎల్ సీజన్ 10కు నేటితో తెరపడనుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్- పుణె సూపర్ జెయింట్స్ మధ్య తుది సమరం జరగనుంది. ఇరు జట్లపైనా భారీ అంచనాలు నెలకొనడంతో పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయి రికార్డు సృష్టించాలని ముంబై పట్టుదలగా ఉండగా, ఎలాగైనా ట్రోఫీ సాధించాలని పుణె భావిస్తోంది. మహారాష్ట్రకే చెందిన ఈ రెండు జట్ల మధ్య పోరు ‘మరాఠా వార్’గా మారనుంది.
అయితే ఈ సీజన్లో గెలిచేది పుణేదేనని జ్యోతిష్యులు చెప్పేస్తున్నారు. ముంబై జట్టు కెప్టెన్ రోహిత్‌కు జాతకం అనుకూలంగా ఉందట. 2013,2015లలో ముంబై రెండు సార్లు ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఈ రెండింట్లోనే రోహిత్ శర్మే కెప్టెన్‌గా వ్యవహరించాడు.. అయితే ఈ సారి మాత్రం రోహిత్‌కు ప్రతికూలంగా ఫలితం వచ్చే అవకాశాలున్నాయట.
ఇక ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి కెప్టెన్లుగా వ్యవహరించిన వారిలో అత్యుత్తమ జాతకుడు ధోనీ అట! అందువల్ల ధోనీ రికార్డును రోహిత్ అధిగమించలేడన్నది జ్యోతిష్యుల వాదన. ఇక స్మిత్ విషయానికొస్తే..2011లో తొలి బిగ్‌బాష్ లీగ్ టైటిల్ తప్ప అతడి సారథ్యంలోని జట్టు అంతకుమించి పెద్ద టోర్నీలో విజయం సాధించలేదని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. అంగారక, శుక్ర తదితర గ్రహాలు అత్యంత పటిష్ఠ స్థానంలో ఉన్నాయని చెబుతున్నారు. ధోనీ, రోహితతో పోలిస్తే ఇవి చక్కగా లేకపోయినా ఐపీఎల్ వంటి మెగా టోర్నీ టైటిల్ గెలిచే సత్తా స్మిత్‌కు ఉందంటున్నారు జ్యోతిష్యులు.
జ్యోతిష్యాన్ని పక్కనపెడితే రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో ఇరు జట్లు బలంగా ఉన్నాయి. దీంతో సమ ఉజ్జీల సమరంలో విజేతగా నిలిచేదెవరన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. లీగ్‌లో పుణె చేతిలో ముంబై మూడుసార్లు ఓడినా ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. నాలుగోసారి ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆ జట్టులో అనుభవజ్ఞులు ఉండడమే అందుకు కారణం. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణె అసాధారణ ఆటతీరుతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హాట్ టాపిక్ అయింది.