KTR:వికాసం వైపుకు తెలంగాణ..కేసీఆర్‌దే ఘనత

36
- Advertisement -

ఓరుగల్లు అంటే ఉద్యమాల వీరగడ్డ. వరంగల్ జిల్లాలోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి హాజరైన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. పది సంవత్సరాల పాటు కేసీఆర్ విద్వంసమైన తెలంగాణను వికాసం వైపు మళ్లించారన్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని…తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారన్నారు.

పరిపాలన పైన పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించాము. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతాం అన్నారు.
ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నాం అన్నారు. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. 2014 ,2019 లలో వరంగల్ ఎంపీ సీటును బీ ఆర్ ఎస్ గెలిచింది. ఈ సారి కూడా వరంగల్ లో గులాబీ జెండా ఎగరాలన్నారు. ఇది ఎనిమిదో పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సన్నాహక సమావేశం. ఈ సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయి. పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటాం..పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటాం అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ను పక్కనపెట్టి… పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు కేటీఆర్. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉంది. ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలన్నారు. మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం మనం గుర్తుంచుకొని ముందుకు పోదాం అన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు ..420 హామీలు ..ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇద్దామనుకున్నాం, గవర్నర్ ప్రసంగం ,శ్వేత పత్రాలతో బీ ఆర్ ఎస్ ను గత కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీయే మొదలు పెట్టింది. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు మన మీద ఆకారణంగా నిందలు వేస్తె ఊరుకోము. అందుకే అసెంబ్లీ లో కాంగ్రెస్ ను గట్టిగా నిలదీశాం అన్నారు. కేసీఆర్ కరెంటు పరిస్థితి బాగు చేశారని చిన్న పిల్ల వాడిని అడిగినా చెబుతారు… కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తాం అన్నారు. ప్రజలను వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదు, ఆసలు సినిమా ముందుందన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించారు ..చెమట ధార పోశారని, కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటి పైన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని భట్టి అసెంబ్లీ వేదిగ్గా అబద్దమాడారని, కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలన్నారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అక్కస్సుతో రద్దు చేస్తుందన్నారు. వాటిపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంటున్నది, పేద గొంతుకలకు మనం అండగా ఉండాలన్నారు. సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ఆలోచించాలన్నారు. నెలరోజుల్లోనే కాంగ్రెస్ పాలన పై వ్యతిరేకత మొదలైందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు పేద ప్రజలను నష్టపరిచాయి ..ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!

- Advertisement -