ఈ ఏడాది జూన్ లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి ఇటీవల షెడ్యూల్ కూడా విడుదల అయింది. ఈసారి టీ20 కప్ లో 20 జట్లు పోటీ పడనుండగా అందరి దృష్టి మాత్రం టీమిండియా పైనే ఉంది. ఎందుకంటే 2019 టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ నుంచి నిష్క్రమించిన టీమిండియా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ కూడా చేజార్చుకుంది. దాంతో ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా గెలవలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి టీ20 బరిలో నిలిచే ఆటగాళ్లపైనే అందరి దృష్టి నెలకొంది. గత ఏడాదిన్నర కాలంగా వన్డేలలో భీకర ఫామ్ కనబరుస్తున్న విరాట్ కోహ్లీకి టీ20 లలో చోటు ఉంటుందా లేదా అనే సందేహాలు క్రీడా వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. టెస్ట్ ల్లోనూ, వన్డేల్లోనూ సత్తా చాటే కింగ్ కోహ్లీ టీ20 లలో మాత్రం తనదైన ముద్ర వేయలేదు.
దాంతో ఈసారి టీ20 మెగా టోర్నీలో అతడి స్థానంలో యువ ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు విరాట్ కోహ్లీ. కానీ ఈసారి టీ20 వరల్డ్ కప్ లో మూడో స్థానంలో కోహ్లీకి బదులుగా సూర్యకుమార్ యాదవ్ లేదా యశస్వి జైస్వాల్ వంటి వారు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం. టీ20 ఫార్మాట్ లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు. అందువల్ల అతడిని మూడో స్థానంలో బరిలో దించితే వేగంగా పరుగులు సాధించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి పొట్టి ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ స్థానం సందిగ్ధంలోనే ఉంది. పైగా 2019 టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడు. కాబట్టి అతడి స్థానంలో కచ్చితంగా మార్పులు ఉండే అవకాశం ఉందనేది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం.
Also Read:హైదరాబాద్లో మరిన్ని డంప్ యార్డులు