వరుసగా అభిమాన సంఘాలతో సమావేశమవుతున్న రజనీ..రాజకీయాల్లోకి ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగిస్తునే రోజుకో ట్విస్ట్‌తో ఉత్కంఠ పెంచుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. మన దగ్గర మంచి నాయకులు ఉన్నా.. వ్యవస్థ సరిగా లేక వాళ్లు ఏమీ చేయలేకపోతున్నారని అన్నాడు. ఇలా చెబుతూ.. అతను డీఎంకే నేత స్టాలిన్ పేరు చెప్పడం ఆసక్తి రేపుతున్నది. తమిళ రాజకీయాల్లోనూ స్టాలిన్, అన్బుమని రాందాస్, తిరుమవలవన్‌లాంటి మంచి నేతలు ఉన్నా.. వ్యవస్థ వారిని సరిగా పనిచేయనివ్వడం లేదు. స్టాలిన్ సమర్థుడే ఆయన కూడా ఏమీ చేయలేకపోతున్నారంటే దానికి కారణం వ్యవస్థే అని రజనీ అన్నాడు.
తమిళనాడు రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నారని కొందరి పేర్లను మాత్రమే రజనీకాంత్ ప్రస్తావించడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఆయన ప్రస్తావించక పోవడం గమనార్హం. తన రాజకీయ స్నేహితుడు, ప్రధాని మోడీ పేరు సైతం రజనీ నోటి వెంట రాలేదు. అయితే మంచి సమర్థుడైన నేతగా రజనీకాంత్ తనను మెచ్చుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ హర్షం ప్రకటించారు. తనను స్నేహితుడిగా భావించినందుకు రజనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని… తమిళనాడులో పాగా వేయాలని ఆ పార్టీ చూస్తోందని అన్నారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రధాని నరేంద్రమోదీని రజనీకాంత్ ఎందుకు ప్రశంసించలేదని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. తనపై వచ్చిన ఒక్క విమర్శనే రజనీకాంత్ తట్టుకోలేక పోయారు, రాజకీయాల్లోకి వస్తే ఇలాంటివి ఎన్నో భరించాల్సి ఉంటుందని అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి హితవు పలికారు. దేశం మొత్తం మీద తమిళనాడులో మాత్రమే శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని రజనీకాంత్ తెలుసుకోవాలని అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యాలయ అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ విమర్శించారు.