ప్రతి మందుకు ఒక ఎక్సపయిరీ డేట్ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే మెడిసిన్ ఎక్సపయిరీ డేట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మెడిసిన్ ఈ దేశం లో పని చేయదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం నాగ్ పూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ 139వ ఆవిర్భావ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నరేంద్ర మోడీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోకసభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమి చేయలేకపోయారని అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
“మోడీ జీ….మీరు ఒక సామాన్య వ్యక్తి ని పార్లమెంట్ లో రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆదానీ, ప్రధాని తప్ప మరేంకాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఒక్కసారి లోకసభలో ప్రశ్నించగానే ఆదానీ ఇంజిన్ ఆగిపోయింది రిపేర్ కోసం షెడ్ కు పోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఈ సారి మణిపూర్ నుంచి ముంబై వరకు చేపడుతున్న భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజిన్ కూడా పని చేయదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ చేపట్టే భారత్ న్యాయ్ యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 150 రోజులపాటు 4 వేల కిలోమీటర్ల మేర చేసిన భారత్ జోడో యాత్రతో మొదట కర్ణాటకలో తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్ యాత్ర మహారాష్ట్రలోకి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు చాలా కీలకమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ 100 రోజులు దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం కేటాయించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడాలని రేవంత్ రెడ్డి నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
Also Read:రవితేజ…’మిస్టర్ బచ్చన్’