భారత్ సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సఫారీలను వారి గడ్డపైనే అత్యల్ప స్కోర్ కు పరిమితం చేసి గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు 27.3 ఓవర్లలో కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ గా నిలిచింది. టోని డే జోర్జ్ (28), అండెల్ ఫెహ్లుక్వేయో (33) మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఏకంగా ఐదు వికెట్లు తీసి సఫారీ జట్టు నడ్డి విరిచాడు. అలాగే ఆవేష్ ఖాన్ కూడా నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసి సౌతాఫ్రికా ను తక్కువ స్కోర్ కు కట్టడి చేశారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. సాయి సుదర్శన్ 43 బంతుల్లో 55 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0 తో టీమిండియా ముందంజలో నిలిచింది.
రికార్డుల మోత
సౌతాఫ్రికా జట్టును వారి స్వదేశంలోనే అత్యల్ప స్కోర్ కు కట్టడి చేసిన జట్టుగా టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సాయి సుదర్శన్ ఆరంగేట్ర మ్యాచ్ తోనే పలు రికార్డులు నమోదు చేశాడు. అరంగేట్రంలోనే అర్థ శతకం సాధించిన నాలుగో టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు. అంతకు ముందు రాబిన్ ఊతప్ప ( 86 పరుగులు ఇంగ్లాండ్ పై ), కేల్ రాహుల్ ( జింబాబ్వే పై 100 పరుగులు , ఫయాజ్ ఫజల్ ( 55 పరుగులు జింబాబ్వే పై ) ఈ ఘనత సాధించారు. ఇక వన్డేల్లో సౌతాఫ్రికాపై వారి దేశంలొనే ఐదు వికెట్లు తీసిన తొలి టీమిండియా పేసర్ గా అర్షదీప్ రికార్డులకెక్కాడు.
Also Read:బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్