తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. కనీసం రెండంకెల సీట్లు కూడా సాధించలేక చేతులెత్తేసింది. మొదట్లో బిఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఓ రేంజ్ లో హడావిడి చేసిన కాషాయ పార్టీ సరిగ్గా ఎన్నికల్లో డీలా పడడానికి ప్రధాన కారణం.. ఎన్నికల ముందు ఆ పార్టీలో చోటు చేసుకున్న పరిణామలే అనేది కొందరి అభిప్రాయం. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించడం. కొత్తగా పార్టీలో చేరిన ఈటెలకు కీలకమైన పదవులు కట్టబెట్టడం వంటి పరిణామాలు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమయ్యాయి. ఫలితంగా నేతల మద్య అంతరం పెరిగి సక్యత లోపించి ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. దాంతో ఎన్నికల ముందు పదవుల మార్పు చేయడం ఎంత నష్టాన్ని కలిగించిందో ఆ తర్వాత అధిష్టానానికి గట్టిగానే అర్థమైంది. .
ఇకపోతే మరో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో మరోసారి మార్పులు చోటు చేసుకుంటాయా ? కాషాయ పెద్దలు మరోసారి పదవుల మార్పు చేపట్టి సాహసం చేయగలరా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీకి పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇంకా నష్టమే ఎక్కువ జరిగిందని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి మళ్ళీ బండికే ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని ఈ మద్య వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాగే మార్పులు చేపట్టి భారీ మూల్యం చెల్లించుకున్న బీజేపీ.. మళ్ళీ ఇప్పుడు ఆ రిస్క్ చేయబోదనేది కొందరు అభిప్రాయం. దాంతో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కిషన్ రెడ్డిని అధ్యక్ష పదవిలో కొనసాగించే అవకాశం ఉందని టాక్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా విఫలం అయిన కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.
Also Read:కాకరకాయ జ్యూస్..రోగాలన్ని మటాష్!