సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ తో చేతులు కలిపింది. తమ సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ కోసం అగ్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ కలయికను తీసుకువచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ వైరల్‌గా మారింది మరియు మహేష్ బాబు యొక్క కొత్త మాస్ లుక్‌ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. నవంబర్ 11న చిత్ర బృందం మొదటి గీతం “ధమ్ మసాలా”ని విడుదల చేయగా, అది తెలుగు ఆల్బమ్‌లలో టాప్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు మేకర్స్ మెలోడియస్ సౌండ్‌ట్రాక్ “ఓ మై బేబీ”ని రెండవ గీతంగా విడుదల చేశారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన “ధమ్ మసాలా” పాటకు వచ్చిన స్పందనతో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ మెలోడీ గీతానికి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కలయికల్లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ”ధమ్ మసాలా” బాటలోనే “ఓ మై బేబీ” పాట కూడా భారీ చార్ట్‌బస్టర్‌గా మారనుంది. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని బృందం పేర్కొంది.ఈ మెలోడీ గీతాన్ని అత్యంత ప్రతిభావంతులైన గాయకులలో ఒకరైన శిల్పా రావు పాడారు. ఈ సోల్ ఫుల్ మెలోడీకి ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శిల్పా రావు యొక్క మనోహరమైన స్వరం ఈ పాటకు ఎంతో అందాన్ని తీసుకొచ్చింది. రామజోగయ్య సాహిత్యానికి ఆమె స్వరం తోడై మ్యాజిక్ చేసింది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తోంది.
రెండు పాటల్లోని ఆహార పదార్థాల పోలిక నేపథ్యం అభిమానులను మరియు ప్రేక్షకులను మరోసారి తెరపై త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మ్యాజిక్ కోసం ఎదురుచూసేలా చేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన అందాల తార శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ని నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటిస్తుంది.
Also Read:IND vs SA T20 :సమం చేస్తారా? సమర్పిస్తారా?