తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ గా ఏపీ పై దృష్టి సారించబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత ఏపీలో హస్తం పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా తలో దారి చూసుకొని ఇతర పార్టీలలో సెటిల్ అయ్యారు. అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందనే మాటే మర్చిపోయారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలో తెలంగాణ విజయం కాంగ్రెస్ కు కొత్త ఊపిరినిచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.. ఇదే ఊపులో ఏపీలో కూడా పూర్వవైభవం సాధించాలనే ఆశ హస్తం నేతల్లో గట్టిగానే ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి.
ఈ మూడు పార్టీలకు పోటీనిచ్చేలా కాంగ్రెస్ బలపడగలదా ? అంటే ముమ్మాటికి అసాధ్యమే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరుకున్న ఏపీ ప్రజలు.. రాష్ట్రాన్ని రెండుగా విభజించిన కాంగ్రెస్ పై ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. అందువల్ల ఏపీపై కాంగ్రెస్ దృష్టి సారించినప్పటికి బలపడే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు విశ్లేషకులు. పైగా ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకుల కొరత గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపై హస్తం పార్టీ దృష్టి సారించాలంటే ముందు సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మద్య వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పటించే అవకాశం ఉందని టాక్ వినిపించినప్పటికీ ఆమె తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేస్తూ వచ్చారు. మరి ఏపీ విషయంలో కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
Also Read:సీఎల్పీ నేతగా రేవంత్..7న ప్రమాణస్వీకారం