శోభాయమానంగా పద్మావతి అమ్మవారి పుష్పయాగం

55
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా జరిగింది.ఉదయం అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఉద్యాన శాఖకు దాతలు సమర్పించిన 3 టన్నుల పుష్పాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు పుష్పాలు, పత్రాలను అందించారు.మధ్యాహ్నం ఆస్థానమండపం నుండి పుష్పాలు, పత్రాలను అధికారులు ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనికి తీసుకెళ్లారు.

అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో పుష్పయాగ మహోత్సవం జరిగింది. వైదికుల చతుర్వేద పారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి వంటి 12 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి చేపట్టారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Also Read:Bigg Boss 7:కోట బొమ్మాలితో బిస్ బాస్

- Advertisement -