ఇప్పటికే బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు భిన్న రంగాల్లో ప్రతిభను చాటిన పలువురు ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కృతం చేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
ఈ క్రమంలోనే మార్షల్ ఆర్ట్స్ కే మాస్టర్ గా పేరు తెచ్చుకున్న బ్రూస్ లీ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైనా నెహ్వాల్, పీవీ సింధుల జీవిత చరిత్రలు కూడా సినిమాల రూపం సంతరించుకుంటున్నాయి. ప్రపంచం మెచ్చిన బ్రూస్ లీ కథ ను సినిమాగా తీయబోతున్నారు బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్.
ఆయన ఈ లోకాన్ని విడిచి నలభై ఏళ్లకు పై మాటే అయినా… ఇప్పటికీ జనాల నోళ్లపై అతని పేరు నానుతూనే ఉంది. హాంకాంగ్ లో పుట్టిన బ్రూస్ లీ ఎన్నో కష్టనష్టాలను ఓర్చి… తాను అనుకున్నది సాధించారు. అతని జీవితం ఎంతోమందికి ఆదర్శం. అందుకే శేఖర్ కపూర్ అతని జీవితచరిత్రను ఎంచుకున్నారు. ఆ సినిమాకు ‘లిటిల్ డ్రాగన్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు బ్రూస్ లీ కూతురు షనోన్ లీనే నిర్మాతగా, సహ రచయితగా ఉంటున్నారు. షనోన్ లీ పలు సినిమాల్లో నటించారు.
బ్రూస్ లీ 1940 నవంబర్ 27న అమెరికాలో జన్మించారు. అనంతరం హాంకాంగ్ కు చేరుకున్నారు. జీవితంలో చాలా కాలం ఆయన హాంకాంగ్ లోనే ఉన్నారు. ఆయన నటించిన ఒకే ఒక్క సినిమా ఎంటర్ ది డ్రాగన్. ఆ సినిమాకు ఇప్పటికీ లక్షల మంది అభిమానులు ఉన్నారు. కానీ 32 ఏళ్ల వయసులో తాను నటించిన సినిమా విడుదలవ్వక ముందే చనిపోయారు బ్రూస్ లీ.
అది కూడా ఆ సినిమాకు డబ్బింగ్ చెబుతూనే కుప్పకూలిపోయారు. అతని మరణానికి కారణం మాత్రం ఇప్పటికీ అనుమానాస్పదమే. అంత హఠాత్తుగా ఎందుకు పడిపోయాడు, మెదుడు ఎందుకు ఉబ్బిపోయిందో వైద్యులు చెప్పలేకపోయారు. అలా 1973 మే10న కోమాలోనే మరణించారు బ్రూస్ లీ. ఇదిలా ఉంటే బ్రూస్ లీ జీవితాన్ని శేఖర్ కపూర్ తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చస్తున్నాడనే వార్తలు వస్తుండటంతో ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.