రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అందరికీ తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని మరోసారి నిజం చేస్తూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కు వత్తాసు పలకడం ఆమె పార్టీ నేతలే జీర్ణించుకోలేక పోతున్నారు. రాజన్న రాజ్యం తెస్తానని, సరైన పదవులు ఇస్తానని తన పార్టీ నేతలకు భరోసా ఇచ్చి తీరా ఎన్నికల సమయానికి కాంగ్రెస్ నుంచి ప్యాకేజ్ అందుకొని హస్తానికే జై కొట్టారు షర్మిల. ఏపీ రాజకీయాలకు దూరంగా తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయంగా ఎదగాలని భావించిన ఆమె.. మొదట్లో కాంగ్రెస్ పై నిప్పులు చెరిగేల చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు.
వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పాతాళానికి నెట్టేసిందని, కాంగ్రెస్ ను రాష్ట్రం నుంచి తరిమేయాలని.. ఇలా తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు షర్మిల. మరి ఇప్పుడు అదే పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నట్టు ? అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పగలరా ? అని రాష్ట్ర ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అటు ఏపీ రాజకీయాల్లోని వైసీపీ నేతలు సైతం షర్మిల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన పార్టీకి షర్మిల సపోర్ట్ ఇవ్వడం దారుణమని.. వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇదిలా ఉంచితే కాంగ్రెస్ తో పొత్తు కోసం షర్మిల గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే షర్మిల కోరిన డిమాండ్లకు హస్తం అధిష్టానం అంగీకరించకపోవడంతో పొత్తు అంశం హోల్డ్ లో పడుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని.. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నానని, పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతలోనే ప్లేట్ మార్చి కాంగ్రెస్ కు జై కొట్టారు. దీన్ని బట్టి చూస్తే షర్మిల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ప్రస్తుతం అటు ప్రజల నుంచి, ఇటు ఇతర నేతల నుంచి వస్తున్న విమర్శలపై షర్మిల ఏం సమాధానం చెబుతారో చూడాలి.
Also Read:కాంగ్రెస్ కు పెద్ద పరీక్షే ఇది?