రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుపై దేశమంతా ప్రశంసల జల్లుకురిపిస్తుంటే మళయాళ సినీ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ అవాకులు, చెవాకులు పేలాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో పిచ్చి రాతలు రాశాడు. సింధు గొప్పతనాన్ని కించపరిచాడు. ‘‘సింధు సాధించిన విజయాన్ని అందరూ వేడుకగా జరుపుకుంటున్నారు. దీని మీద నేను ఉమ్మితే ఏమవుతుంది? అంతగా వేడుకగా జరుపుకోవడానికి ఏముంది ఇందులో?’’ అంటూ శశిధరన్ గేలి రాతలు రాసుకొచ్చాడు.
పీవీ సింధును భారతీయులంతా సమున్నతంగా గౌరవిస్తూ ఉన్న సమయంలో శశిధరన్ వెకిలి రాతలపై విమర్శలు గుప్పిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేరళీయులు సైతం పీవీ సింధు వైపు నిలబడి శశిధరన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం. కొంత మంది వ్యక్తులు ఉన్నత స్థానాల్లో ఉన్నా, వాళ్ల మనసులు సంకుచితంగానే ఉంటాయనడానికి శశిధరన్ నిలువెత్తు నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.
దీంతో స్పందించిన శశిధరన్ తాను వ్యంగ్యంగా రాశానని, తన భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో తీసిన ‘ఒరివు దివసాథే కలి’ అనే సినిమాకు అవార్డును కూడా అందుకోవడం గమనార్హం.
గతంలో రాంగోపాల్ వర్మ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఒక్క రజత పతకానికే మనల్ని మనం ఇన్క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటున్నామని, మరి 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని ఏమనాలని, జస్ట్ అడుగుతున్నానని ట్వీట్ చేశాడు.