ఏపీ రాజకీయాల్లో పవన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో ఎవరు ఊహించలేక పోతున్నారు. అసలు పవన్ ఏం ఆలోచిస్తునారు.. ఆయన అడుగులు ఎటు పడుతున్నాయి అనేది విశ్లేషకులకు సైతం అంతు చిక్కడంలేదు. మొదటి నుంచి బీజేపీ మిత్రాపక్షంగానే ఉన్న పవన్.. సరిగ్గా ఎన్నికలకు దగ్గర పడే కొద్ది వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి ఆ పార్టీ విషయంలో పవన్ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు తనకు రూట్ మ్యాప్ ఇవ్వడంలో బీజేపీ విఫలం అయిందని గతంలో బీజేపీకి చురకలంటించారు. కేంద్రంలో అధికార పార్టీ అయినందున ఎన్డీయేలో తప్పక ఉండాల్సివస్తోందని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేకం.
ఇలా బీజేపీకి దోస్తీగా ఉంటూనే అప్పుడప్పుడు ఆ పార్టీకి షాక్ ఇస్తూ వచ్చారు. ఇక ఇటీవల ఊహించని విధంగా బీజేపీ ప్రమేయం లేకుండానే టీడీపీతో హటాత్తుగా పొత్తు ప్రకటించారు పవన్. దీంతో ఒక్కసారిగా కాషాయ పార్టీనేతలు కంగుతిన్నారు. తమతో పొత్తులో ఉంటూనే కనీసపు సమాచారం ఇవ్వకుండా వేరే పార్టీతో పొత్తు ప్రకటించడం ఏంటని కమలనాథులు తలలు పట్టుకుంటున్నారట దీంతో అప్పటివరకూ పవన్ మా వాడే అని చెబుతూ వచ్చిన కమలనాథులు ఇక జనసేన విషయంలో సైలెంట్ అయ్యారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే పెడనలో జరిగిన వారాహి యాత్రలో మరో స్ట్రోక్ కూడా ఇచ్చారు జగన్ ను గద్దె దించేందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు.
దీంతో జనసేన ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందని వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో తెగ చక్కర్లు కొట్టాయి. వైసీపీ నేతల్లో సజ్జల వంటి వారు కూడా పవన్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటన చేశాడని, ఆయన ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి కాదని ‘ విమర్శలు గుప్పించారు. కానీ ఇంతలోనే తాను చెప్పిందంతా తూచ్ అంటూ ఎన్డీయే నుంచి బయటకు రాలేదని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో అసలు పవన్ ఏం ఆలోచిస్తున్నారు ? ఏం వ్యూహాలు రచిస్తున్నారు అనేది గజిబిజి పజిల్ గా మారింది. అయితే బీజేపీకి స్వీట్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేందుకే పవన్ ఇలా వ్యవహరిస్తున్నాడని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ మద్దతు ఇవ్వాలపోతే తాను ఎన్డీయే నుంచి బయటకు రావడానికి సిద్దంగా ఉన్నానని బీజేపీని హెచ్చరించేందుకే పవన్ ఇతర వ్యాఖ్యలు చేస్తున్నారనేది కొందరి విశ్లేషకులు చెబుతున్నా మాట. మొత్తానికి పవన్ వ్యూహాలు అర్థంకాక అటు వైసీపీ ఇటు బీజేపీ మల్లగుల్లాలు పడుతున్నాయని చెప్పవచ్చు.
Also Read:World Cup 2023: భారత స్పిన్నర్లతో ప్రమాదమే!