టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా సింఘాల్‌ను నియమించడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ‘‘టీటీడీ బాధ్యతలను ఉత్తరాది ఐఏఎస్ చేపట్టడానికి నేనేమీ వ్యతిరేకం కాదు. మరి… అమర్‌నాథ్, వారణాసి, మధుర వంటి దేవాలయాల పరిపాలనాధికారులుగా దక్షిణాది అధికారులను ఉత్తరాది వాళ్లు అంగీకరిస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా ఎందుకు చేశారో ఆశ్చర్యంగా ఉంది. దీనిపై ఏపీతోపాటు యావత్ దక్షిణాదికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’’ అని పవన్ ట్వీట్ చేశారు.
దీనికి టీడీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి దక్షిణ భారతీయులకు మాత్రమే అని ఎక్కడైనా చట్టంలో ఉందా? అంటూ పవన్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో తమకు మద్దతిచ్చాడని, అయినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోమంటూ తెగేసి చెబుతున్నారు.
మరోవైపు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అనిల్ కుమార్ సింఘాల్ కు మద్దతుగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్టర్ గా సింఘాల్ సేవలందించారని, సింఘాల్ నిజాయతీపరుడుని, అంకిత భావం కలిగిన అధికారి అని మోహన్ బాబు ప్రశంసించారు. టీటీడీ ఈవోగా సింఘాల్ కు సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా, ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, అతను సినిమా నటుడంటా, సినిమాలు చూసి చాలా కాలమైందని, టీటీడీ ఈవో ఎంపికపై తాను స్పందించనని అన్నారు. తమ నాయకుడే తమకు తెలియదా అంటూ జనసేర కార్యకర్తలు అశోకగజపతి రాజుపై మండిపడుతున్నారు.