తెలుగు చిత్రసీమను కొత్తపుంతలు తొక్కించిన మహానటుడు అక్కినేని. ఆయన ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకే వన్నె తెచ్చేవారంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన తన నటనాభినయంతో అందరి మనసులను దోచుకునేవారు. ఇక అక్కినేనిని వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా దేశమంతా ఘననివాళులు అర్పిస్తోంది. మరోవైపు ‘అక్కినేని నాగేశ్వరరావు’ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకలో రాజమౌళి మాట్లాడుతూ.. ANRను చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూశా తప్ప.. వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. ఆయన అందరికీ ఒక ప్రేరణ. దేవుడిపై నమ్మకం లేకున్నా.. భక్తిరస చిత్రాల్లో అద్భుతంగా నటించారన్నారు.
ఈ వేడుకలో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు కారణజన్ముడు అని కొనియాడారు. రైతు కుటుంబంలో పుట్టి అద్భుతమైన స్థితికి ANR చేరుకున్నారు. నటన అనే చిన్న అర్హతతో మహోన్నత వ్యక్తిగా ఎదిగారని కొనియాడారు. ఆయనకు వచ్చినన్ని అవార్డులు ఇంకెవరికీ రాలేదని, ఆయన దక్కినన్ని సన్మానాలు మరెవరికీ జరగలేదని తెలిపారు.
ఇక అక్కినేని శతజయంతిని పురస్కరించుకుని నివాళులర్పిస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులు. తెలుగు సినిమా బతికినంత వరకు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’ అంటూ పోస్ట్ చేశారు.
Also Read:ANR Statue:ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు